దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఎస్పీ, డీఎస్పీ, ఇన్ స్పెక్టర్లతో పాటు మరికొందరు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో కొన్నిరోజుల కిందట దారుణమైన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. హత్రాస్ కు చెందిన 19 ఏళ్ల యువతిపై కొందరు వ్యక్తులు అత్యంత దారుణమైన రీతిలో దాడికి పాల్పడ్డారు. ఆమె నాలుక కోసేసి నడుం విరగ్గొట్టి కొందరు దుర్మార్గులు పైశాచికంగా ప్రవర్తించినట్టు విషయం వెలుగులోకి వచ్చింది. అఘాయిత్యానికి గురైన ఆ యువతి ఢిల్లీలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. ఆ యువతి అత్యాచారానికి గురైనట్లు దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ దారుణాన్ని ఖండించారు.
అనుమానాలు
ఈ నేపథ్యంలో యువతి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్రాస్ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనను అడ్డుకున్న పోలీసులు ఆయనను హత్రాస్ కు అనుమతించలేదు. దీంతో రాహుల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. జరిగిన ఈ దారుణంపై విపక్షాలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే, ఫోరెన్సిక్ నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు చేసిన ప్రకటనపై అనుమానాలు రేకెత్తాయి. కేసును యూపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అనుమానాలను మరింత పెంచుతూ యూపీ పోలీసులు ఓ నిర్వాకాన్ని చేశారు. ఆ అమ్మాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే అర్ధరాత్రి హడావుడిగా దహనం చేశారు. ఆమె మృతదేహాన్ని ఖననం చేయకుండా దహనం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కఠిన చర్యలకు ఆదేశించిన సీఎం
ఈ కేసులో పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ‘నిర్భయ’ ఘటన అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో చెడ్డపేరు తెచ్చింది. ‘హత్రాస్’ కేసులో కూడా సకాలంలో చర్యలు తీసుకోకపోతే నష్టపోకతప్పదని యోగికి అధిష్ఠానం నుంచి హెచ్చరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం జోక్యం చేసుకుంది. హత్రాస్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇన్ స్పెక్టర్లతో పాటు మరికొందరు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతేకాదు, ఎస్పీ, డీఎస్పీలకు నార్కో పాలీగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహిస్తారని పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర చర్యలకు ఉపక్రమించడంతో బాధిత కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.