iDreamPost
android-app
ios-app

Harekala Hajabba – నారింజ పళ్లే ఆ ఊరి దిశను మార్చేశాయ్.. పళ్ళమ్మి స్కూల్ కట్టి పద్మశ్రీ పొంది ..

Harekala Hajabba – నారింజ పళ్లే ఆ ఊరి దిశను మార్చేశాయ్.. పళ్ళమ్మి స్కూల్ కట్టి పద్మశ్రీ పొంది ..

తెల్లటి చొక్కా మరియు ధోతీ ధరించి, చెప్పులు లేని 68 ఏళ్ల వ్యక్తి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వద్దకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి నడిచాడు. ఆయనే హరేకల హజబ్బా, ఆయన పద్మ అవార్డు అందుకున్న చారిత్రాత్మక ఘట్టాన్ని కెమెరాల్లో బంధించారు. అయితే హజబ్బా ను ఎందుకు గౌరవించారు? మంగళూరులో నారింజ పళ్ళు అమ్మే హజబ్బా పద్మశ్రీ అవార్డు ఎందుకు అందుకున్నాడు? అని మీకు అనుమానం కలగవచ్చు. కానీ ఆయన చేసిన పని విన్నాక ఆశ్చర్యం కలగక మానదు.

ప్రతి ప్రయాణం ఒక ఆలోచనతో

‘ప్రతి ప్రయాణం ఒక ఆలోచనతో ప్రారంభమవుతుంది’ అని నారింజ పళ్ళు అమ్మే హరేకల హజబ్బా చూపించారు. 64 ఏళ్ల హరేకల విద్యారంగంలో చేసిన కృషికి దేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వరించింది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు ఈ అవార్డును అందజేశారు. కర్నాటకకు చెందిన హరేకల హజబ్బా గ్రామమైన న్యూపడపులో అసలు స్కూల్ లేదు. అందుకే హజబ్బా ప్రాథమిక విద్య కూడా నేర్చుకోలేదు. అయితే వ్యాపారం చేసుకోవాలి కాబట్టి డబ్బు కూడికలు, తీసివేతలు మాత్రమే నేర్చుకోగలిగాడు. కుటుంబ ఖర్చుల కోసం నారింజ పళ్ళ షాప్ నడిపేవాడు. రోజూ లాగానే ఓ రోజు షాప్ లో నారింజ పళ్ళు అమ్ముతున్న సమయంలో కొంతమంది విదేశీ పర్యాటకులు అతని వద్దకు వచ్చి ఆంగ్లంలో నారింజ ధరలు అడిగారు. కానీ చదువు రాకపోవడంతో ధర చెప్పలేకపోయాడు. ఈ ఘటనతో ఆయన ఎంతో సంఘర్షణకు గురయ్యాడు. ఏళ్ల తరబడి అమ్ముతున్న పండ్ల ధర కూడా చెప్పలేకపోయానని చాలా రోజులుగా ఆలోచిస్తున్నాడు.

ఏదైతే అదే అయిందని

చివరికి ఒక ఆలోచన రావడంతో 2000 సంవత్సరంలో, హరేకల హజబ్బా తన జీవితంలో పొదుపు చేసిన మొత్తాన్ని తన గ్రామంలో పాఠశాలను ప్రారంభించేందుకు పెట్టుబడి పెట్టారు.నిజానికి ముందు కొంతమంది పేద విద్యార్థులతో స్థానికంగా ఉన్న మదర్సాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు కానీ క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో పాఠశాల నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఒక ఎకరం స్థలం కొని ఇతర దాతలు నుంచి విరాళాలు సేకరించి, ప్రభుత్వ అధికారుల సహాయంతో న్యూపడపు గ్రామంలో పాఠశాల నిర్మించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ రోజూ ఆ పాఠశాల ఆవరణను హజబ్బా శుభ్రం చేస్తారు.

అదే కల

పాఠశాలను ప్రారంభించారు కానీ అది ముందు జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి వరకు తెలిసింది. హజబ్బా సేవలను గుర్తించి కర్ణాటక ప్రభుత్వం ఎన్నో పురస్కారాలు అందించినా కానీ 2020లో ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డు వచ్చిందని పేర్కొన్న సమయాన ఆయన చేసిన గొప్ప పని దేశవ్యాప్తంగా గుర్తించబడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా గతేడాది పద్మ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయారు.
ఇక హరేకల హజబ్బా పాఠశాలలో, ప్రాథమిక స్థాయిలో ఇప్పటికీ విద్యాభ్యాసం కొనసాగుతోంది. అయితే భవిష్యత్తులో తన గ్రామంలో ఒక ప్రీ-యూనివర్శిటీ కళాశాల ఉండాలనేది హజబ్బా కల. వీలైనంత త్వరగా గ్రామంలో ప్రీ యూనివర్సిటీ కళాశాల ప్రారంభించేందుకు ఆయన నిరంతరం సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగం హజబ్బా ను సత్కరించడానికి ఏర్పాట్లు చేసింది.