iDreamPost
android-app
ios-app

ఆస్కార్ రాలేదని ఫీలవ్వాలా?

  • Published Sep 21, 2022 | 12:47 PM Updated Updated Sep 21, 2022 | 12:47 PM
ఆస్కార్ రాలేదని ఫీలవ్వాలా?

ఎన్నో ఆశలు పెట్టుకుంటే వాటిని ఆవిరి చేస్తూ ఆర్ఆర్ఆర్ బదులు గుజరాతీ సినిమా చేల్లో షోని ఇండియా తరఫున ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా పంపడం మూవీ లవర్స్ తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇంతా చేసి ఇప్పుడు నామినేట్ చేసిన చిత్రం కూడా 1988లోనే అకాడెమి అవార్డు గెలుచుకున్న ‘సినిమా పారాడిసో’కి ఫ్రీమేక్ అన్న విషయం అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా దేశ విదేశాల్లో వంద రోజులు తర్వాత కూడా ప్రశంసలు దక్కించుకుంటున్న ట్రిపులార్ కు గౌరవం దక్కి ఉండాల్సిందని మెజారిటీ అభిప్రాయ పడుతున్నారు. కమిటీ సభ్యుల తీరు పట్ల నిరసన వ్యక్తమవుతోంది. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం జక్కన్నకే మద్దతు ఇస్తున్నారు.

నిజానికి ఆస్కార్ వచ్చినా రాకపోయినా అంతగా ఫీలవ్వడానికి ఏం లేదనే చెప్పాలి. ఒక పాటర్న్ పెట్టుకుని దాని ప్రకారమే సినిమాలను చూసి విశ్లేషించే ఆ గౌరవ పురస్కారాలను ఎంపిక చేసే సభ్యులకు ఇతర దేశాల నేటివిటీ మీద అక్కడి ప్రజల సంస్కృతి అభిరుచుల మీద పూర్తి అవగాహన ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు అదే పనిగా గుర్తించాల్సిన అవసరం లేదు. సత్యజిత్ రే, గోవింద్ నిహలాని, కె విశ్వనాథ్, టి కృష్ణ, అశుతోష్ గోవారికర్, సంజయ్ లీలా భన్సాలీ లాంటి ఎందరో ఉద్దండులు అద్భుత దృశ్యకావ్యాలను రకరకాల నేపద్యాల్లో గొప్పగా ఆవిష్కరించారు. అవేవీ ఆస్కార్ గడప తొక్కనంత మాత్రాన విలువ కోల్పోలేదు. ప్రతి భారతీయుడికి ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.

ఇప్పుడేదో ఆస్కార్ వస్తేనే మనమేదో సాధించినట్టు ముమ్మాటికీ కాదు. ఆ మాటకొస్తే బాహుబలి చైనా, జపాన్ లాంటి దేశాల్లోనూ వేల కోట్ల వసూళ్లు తేవడం మర్చిపోకూడదు. దంగల్ లోని ఎమోషన్ ఎన్నో దేశాల్లో ఆడియన్స్ ని కట్టి పడేసింది. సీక్రెట్ సూపర్ స్టార్ సైతం గొప్పగా ఆడిన దాఖలాలు ఉన్నాయి. వీటికి అకాడెమి గుర్తింపు దక్కలేదు కాబట్టి తక్కువగా చేసి చూడలేం కదా. ఆర్ఆర్ఆర్ చూసి మార్వెల్ సూపర్ హీరోస్ కన్నా రామరాజు, భీమ్ లే హీరోయిజంకు నిర్వచనంగా కనిపించారని సుప్రసిద్ధ హాలీవుడ్ నిపుణులు పొగడటం గుర్తుందిగా. ఇక్కడికి అయిపోలేదు. జనరల్ క్యాటగిరీలో నేరుగా అప్లై చేసుకోవటానికి ఆర్ఆర్ఆర్ కు ఇంకా అవకాశం ఉంది కాబట్టి అప్పుడే ఓ కంక్లూజన్ కు రాలేం కానీ వేచి చూడాలి