Idream media
Idream media
ఉస్మానియా యూనివర్శిటీ (ఓయు) భూ వివాదాలపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేంద్ర బిందువు అయిన ప్రతిష్ఠాత్మక విద్యాలయం ఓయు భూములు ఎప్పటి నుంచో ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ ఆక్రమణలపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తునే ఉన్నాయి. అయితే ఇటీవలి ఓయు భూములు ఆక్రమణకు గురైయ్యాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఏకంగా ఆక్రమణ చేసిన స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేశారు. దీంతో ఓయు భూ ఆక్రమణ అంశం తెలంగాణలో తీవ్ర చర్చ జరిగింది. ఈ వివాదం రాజకీయాంశంగా మారడంతో ఏకంగా గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఓయు భూవివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని యూనివర్శిటీ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డిని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గవర్నర్, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఈ వివాదాలను సమర్థంగా ఎదుర్కోవాలని యూనివర్శిటీ అధికారులకు చెప్పారు.
ఒక్క అంగుళం కూడా కబ్జాకు గురి కాకుండా పరిరక్షించాలన్నారు. యూనివర్సిటీకి చెందిన హెరిటేజ్ (చారిత్రక) నిర్మాణాలు దెబ్బతినకుండా కాపాడాలన్నారు. కరోనా సంక్షోభం నెలకొన్నందున విద్యార్థులకు పరీక్షలు ఆన్ లైన్ లలో నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ప్రాక్టీస్ అయ్యేందుకు ముందుగా ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆన్ లైన్ పరీక్షలకు సంబంధించి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అందుకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు.
విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెంచేలా పరిశ్రమలతో సమన్వయం చేసుకుని కొత్త కోర్సులు రూపొందించాలని ఓయు అధికారులకు గవర్నర్ సూచించారు. సిలబస్ ను ఆర్ట్స్ కోర్సుల స్టడీ మెటీరియల్ మెరుగుపరుచాలన్నారు. విద్యార్థుల్లో చైతన్యం కలిగించి ఆన్ లైన్ కోర్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తీర్ణత పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్ డౌన్ అనంతరం యూనివర్సిటీ ప్రారంభమయ్యాక…తరగతి గదులు, హాస్టళ్లలో భౌతిక దూరం, శానిటైజేషన్ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.
పూర్వ విద్యార్థుల సమన్వయం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి.. ఓ ప్రొఫెసర్ ను నియమించాలని సూచించారు. వచ్చే రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం నాటికి ప్రతి పూర్వ విద్యార్థులను సంప్రదించాలని చెప్పారు. బోధన, బోధనేతర ఖాళీలు, మౌలిక వసతుల కల్పన, భూ వివాదాలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారమయ్యేలా చూస్తానని ఓయు అధికారులకు గవర్నర్ హామీ ఇచ్చారు.