iDreamPost
iDreamPost
రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. చంద్రబాబు హయాంలో సాగించిన ప్రచారార్భాటం మినహా అభివృద్ధి జాడలేదు. జగన్ సీఎం అయిన తర్వాత కోవిడ్ కారణంగా అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రపంచమంతా స్తంభించిన వ్యవస్థ ప్రభావం ఏపీ మీద కూడా పడింది. అయితే ఇటీవల మళ్లీ ఆశలు చిగురించేలా పరిణామాలు సాగుతున్నాయి. కొత్త ఏడాదిలో అవన్నీ ఆచరణలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త సొగసులద్దడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కి విశాలమైన సముద్రతీరం ఉన్నప్పటికీ వినియోగించుకోవాలనే స్పృహ చంద్రబాబుకి కనిపించ లేదు. కేవలం అమరావతి, దాని గ్రాఫిక్స్ మినహా ఒనగూరిన ప్రయోజనం లేదు. కానీ ఇటీవల తీర ప్రాంతంలో కొత్త పోర్టులు, జెట్టీల నిర్మాణం కోసం జగన్ సర్కారు చేసిన యత్నాలు కొలిక్కి వస్తున్నాయి. త్వరలోనే భావనాడు, బందరు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బందరు పోర్టు టెండరు దశలో ఉంది. భావనపాడు , రామాయపట్నం కూడా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇవన్నీ నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తుతున్నట్టుగానే భావించాలి. ఇప్పటికే తెలంగాణా, ఛత్తీస్ గఢ్ సహా సమీప రాష్ట్రాలతో ఏపీ ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది. కొత్త పోర్టులను వినియోగంలోకి తీసుకొచ్చేదిశలో వేగంగా సాగుతోంది.
విద్య,వైద్య రంగాల్లో ఏపీ సమగ్రాభివృద్ధి సాధించే దిశలో సాగుతోంది. రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుదల కోసం కొత్తగా చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం గడిచిన ఏడాదిలో కీలక పరిణామంగా భావించాలి. కొత్త సంవత్సరంలో వాటికి ఓ రూపం వస్తే రాబోయే కొద్దికాలంలోనే ప్రజలకు అందుబాటులోకి రావడం ఖాయంగా మారుతుంది. ముఖ్యంగా ఓ సాధారణ ఆస్పత్రి లో సదుపాయాలు మెరుగుపరిస్తే చాలు అనుకుంటున్న దశలో పాడేరు, గురజాల సహా అనేక ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం ఓ మూలమలుపు కాబోతోంది. ఏపీలో వైద్యరంగం విశేషాభివృద్ధి దిశలో పరుగులు పెట్టబోతోంది.
నాడు-నేడుతో బడులు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ వంటివి అందుబాటులోకి వస్తే పారిశ్రామికాభివృద్ధికి తగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. ఇక సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కుతున్న రాష్ట్రం ఎట్టకేలకు అభివృద్ధి పరంగానే అనేక మార్పులకు కేంద్ర స్థానం అవుతుంది. శ్రీ సిటీ వంటి వాటికి తోడుగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్, కాకినాడ సెజ్ వంటివి కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. విశాఖ పారిశ్రామిక నగరానికి తోడుగా పలు ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. ఇప్పటికే సన్ ఫార్మా, శ్రీ సిమెంట్ సహా పలు ప్రసిద్ధి చెందిన కంపెనీలు పెట్టుబడులకు సుముఖత చూపాయి. అవన్నీ ఆచరణ రూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 2022 కీలకంగా మారుతుందనడంలో సందేహం లేదు.
రాష్ట్ర విభజనకు ముందు అంతా హైదరాబాద్, విభజన తర్వాత పూర్తిగా అమరావతి అన్నట్టుగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ ప్రభుత్వం విశాల దృక్పథంతో వ్యవహరించడం గమనించాల్సిన విషయం.
వాటి ఫలితాలు కూడా విస్తృత ప్రాతిపదికన ఉండబోతున్నాయి. అందుకు ఈ ఏడాది కీలకం అవుతుంది. కోవిడ్ కారణంగా నష్టపోయిన కాలాన్ని వీలయినంత వేగంగా అధిగమించి, ఏపీ అభివృద్ధి బాటలో పయనించేందుకు కొత్త సంవత్సరం అన్ని రకాలుగా కలిసి వస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.