iDreamPost
android-app
ios-app

వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి పోలవరం జలాల గలగలలు

  • Published Jun 03, 2021 | 3:39 AM Updated Updated Jun 03, 2021 | 3:39 AM
వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి పోలవరం జలాల గలగలలు

పోలవరం ప్రాజెక్టు కల సిద్ధించే సమయం ఆసన్నమవుతోంది. గోదావరి జలాల మళ్లింపునకు ముహూర్తం పెట్టేశారు. రాబోయే సంవత్సరం ఖరీఫ్ నాటికి నదీ జలాలను సాగునీటికి మళ్లించే లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెఘా కంపెనీ కాంట్రాక్ట్ సంస్థ కూడా ప్రత్యేక శ్రద్ధ సారించడంతో జగన్ ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రాజెక్టు కలని సాకారం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే కాఫర్ డ్యామ్ పూర్తిగా మూసేశారు. దాంతో నదీ ప్రవాహాన్ని కుడివైపునకు మళ్లించారు. స్పిల్ వే మీదుగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్పిల్ వే ని సిద్ధం చేయడంలో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్ట్ సంస్థ కృషి ఫలించింది. స్పిల్ వే పూర్తికావడంతో మెయిన్ డ్యామ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్టేనని చెప్పవచ్చు. ఇక వచ్చే సీజన్ నాటికి నీటిని మళ్లించే ఏర్పాట్లపై శ్రద్ధ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరంలో పర్యటించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇస్తాం. దాని ప్రకారం ప్రణాళికలను అమలు చేస్తున్నామంటూ ప్రకటించారు. గత ప్రభుత్వ హయంలో మొదటి మూడేళ్ల పాటు నిర్లక్ష్యం చూపడంతో పోలవరం పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. చివరిలో హడావిడి చేసినా చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదం ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.

కోవిడ్ కష్టకాలంలోనూ ధైర్యంగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నామని, పనులు కొనసాగించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖలో మొత్తం 80 మంది సిబ్బంది కోవిడ్ కారణంగా మరణించినా ఎక్కడా పనులు ఆపలేదని ఆయన గుర్తు చేశారు. పెనువిపత్తులోనూ పనులు ఆపకుండా పనిచేస్తున్న వారిని కించపరిచేలా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు.

పోలవరం కాఫర్ డ్యామ్ ను సక్రమంగా కట్టకపోవడం వల్ల, ప్రణాళికా లోపం వల్ల, డయాఫ్రం వాల్ డ్యామెజ్ అయింది. దీనికి కారణం చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనం కాదా..? అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి 17 వేల ఇళ్ళను ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనుకున్నాం. కానీ కరోనా కేసుల కారణంగా పనులు ముందుకు సాగలేదని వివరణ ఇచ్చారు. త్వరలోనే వాటిని పూర్తిచేసి నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని మంత్రి వివరించారు.

ప్రభుత్వం మాత్రం ప్రణాళికాబద్ధంగా వెళుతున్నట్టు కనిపిస్తోంది. కాఫర్ డ్యామ్ సహాయంతో స్పిల్ వే మీదుగా గోదావరి నీటిని మళ్లించిన నేపథ్యంలో ఈ సీజన్ లో పరిస్థితి గమనించి, వచ్చే ఏడాది నుంచి కాల్వలకు నీటిని మళ్లించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా అంతా సిద్ధం చేస్తున్నారు. గ్రావిటీ సహాయంతో ఈ యత్నం ఫలించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే గోదావరి జలాలు పొలాల బాట పట్టేందుకు ఒక్క ఏడాది మాత్రమే సమయం ఉందని చెప్పవచ్చు.