iDreamPost
android-app
ios-app

రేవు కొట్టుకుపోయింది!

రేవు కొట్టుకుపోయింది!

“రేయ్ ఆ టేబిలు మీదకీ పెసరట్టు.. తొరగా తినేత్తే స్ట్రాంగుటీ ఒకటిత్తాను అట్టుకెళ్ళు” అరుస్తున్నాడు వెంకబాబు. ఏటిగట్టు మీదుండే ఆ హొటేలులో ఈ రకం కేకలు రోజూ మామూలే. కాలేజీ చదివే పిల్లలు, అవతల గట్టున ఉజ్జోగాలు, బేల్దారి పనులు చేసీవోళ్ళూ తొమ్మిదీ పదవకండానే రేవు దాటటానికొత్తారు. ఆ కాసేపే ఈ హడావుడంతా. చుట్టుపక్కలున్న ఆ కాసిన్ని లంక గ్రామల్లో ఈ రేవు దగ్గరే జనం తాకిడెక్కువ.

ఏటిగట్టునే ఆనుకునుండే అయిదారు కొట్లు, గంపలతో గట్టు మీద కుర్చుని అమ్ముకునే మనుషులతో ప్రతి రోజూ పొద్దున్నో రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలూ జనాలతోనీ, వచ్చీ పోయే నావలతోనీ, ఈ వెంకబాబు కేకలతోనీ తొడతొక్కిడిగా ఉంటాది. అసలొకోసారి తినడానికొచ్చేవోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడానికే చాలా విసుగు పడిపోయే వెంకబాబుకి గల్లా పెట్టి దగ్గర కుర్చుని డబ్బులు తీసుకోడం కన్నా, కాశీ తువ్వాలు భుజం మీదేసుకుని.. పెనం మీద దోశెలు తిప్పడమంటేనే మహా ఇష్టం. ఇంతా చేసి ఉదయం సాయంత్రం దోశెలేస్తే వచ్చే దానితో తన కుటుంబం నోట్లోకి నాలుగు వేళ్ళూ వెళ్ళేలా, అపుడపుడూ వారికీ వీరికీ మంచి చెడ్డలు చూడగలిగే పరిస్థితికి రాగలిగాడు అతను.

అసలీ ఊర్లో జనానికి తెల్లారిలేస్తే గోదారి దాటి అటువైపు రేవులో దిగి, రిక్షాలో, బస్సులో పట్టుకోందే పనులు తెమిలేవి కావు. గోదారిని ఆనుకుని ఉండటం, ఏటా మూడు పంటలు పండటం వల్ల ఆ ఊళ్ళో జనానికి కూడా వ్యవసాయానికి కావాల్సిన అన్ని పనులూ అటేపే ఉండేవి. సినేమాలూ, ఆసుపత్రులు, సంతలూ, గవర్మెంటాఫీసులు ఒక్కటేంటి అన్నిటికీ గోదారమ్మని దాటాల్సిందే. ఊర్లో ఉన్న జనాల ప్రాణాలకి కాపలాగా ఉండేది ఒక్క ప్రాధమిక ఆరోగ్యకేంద్రం మాత్రమే. అందులో డాక్టరు మాత్రం ఎప్పుడూ మందు మీదుంటాడు.

ఓసారిలానే.. వెంకబాబు పెళ్ళానికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని ఓ సాయంత్రం తెడ్డేసి నాటు పడవలో బయల్దేరితే.. గోదారి దాటడం ఆలస్యమైపోయి వాళ్ళావిడ పడవలోనే సచ్చిపోయింది. ఆసుపత్రి అందుబాటులో లేని ఊరినో, చావుకి కారణమైన గోదారినో ఏ రోజూ ఒక్క మాటని ఎరగడు ఆ వెంకబాబు. పైగా.. నా పెళ్ళాం గోదారి తల్లి పాదాల దగ్గర పుట్టింది, గోదారమ్మ ఒడిలో సచ్చిపోయింది అని సర్దిచెప్పుకుని, అప్పటినుండీ ఆడి పెళ్ళాం పంజేసొదిలేసిన పెనం మీద దోశెలేస్తా… పెళ్ళాంతో మాట్లాడినట్టే తెగ ఇదైపోయేవాడు. ఆ ఏటిగట్టునీ, రావి చెట్టు కింద ఉండే ఆంజేయసామి విగ్రహాన్నీ, ఆ వెంకబాబు ఒటేలునీ, చుట్టూ ఉన్న కొట్లనీ విడదీసి చూడటం ఆ ఊరి జనానికి అవ్వని పని.

ముగ్గు పడవలలోళ్ళు ఆ రేవులో పడవలాపి, ఒడ్డుకున్న చెట్లకి లంగర్లు కట్టుకుంటున్నారు. రేవునానుకుని కుడిపక్కున్న కొట్లో నాగేసర్రావ్ సోడా కాయల్ని కడుక్కుంటున్నాడు నిమ్మసోడా పట్టించడానికి. అతని కిళ్ళీ కొట్టుకు బయట కట్టిన తాటాకు పందిరి ఎండిపోయుంది. ఆ పందిరి రాటలకి కట్టిన తాళ్ళకి రావులపాలెం అరటి మార్కెట్లో అమ్మే చక్కెరకేళీ అరటి గెలలు ఏలాడకట్టున్నాయ్. పాసింజర్ల పడవ ఒస్తే అమ్మడానికి వెదురు తట్టలో ఉన్న కనకాంబరం పూల దండల మీద నీళ్ళు జల్లుతుంది రేవొడ్డున గొంతుక్కుర్చున్న ఆడావిడి. ఆవిడ చేతిలో ఉన్న తట్టకి కుడివైపున సెవెనోక్లాక్ బ్లేడు పురుకొసతో ముడేసి ఉంది. దూరంగా గోదార్లోంచి వస్తున్న పాసింజరు పడవని చూసి చిరుతిళ్ళు అమ్ముకునేవాళ్ళూ, అద్దరికి వెళ్ళే పాసింజర్లు లేచి నిలబడుతున్నారు.

అయితే అందరూ అనుకున్నట్టు ఆ వచ్చిన పాసింజరు పడవలో ఊరి జనాలెవరూ దిగలేదు. నెత్తి మీద పసుపు రంగు టోపీలతో, టక్కు చేసుకుని చేతిలో పేపర్లతో దిగడిన మనుషులు ఒకటే హడావుడి పడిపోయి ఈ మూలనుండా మూలకి తిరిగేత్తా కొలతలూ లెక్కలూ వేసుకుంటున్నారు. సైకిలు మీద ఇంటింటికీ తిరిగి ఇంజెక్షన్లు జేసే ఆరెంపీ డాక్టరు జానీ ఈ హడావుడి చూసి అందులో ఓ ఇంజినీరు మనిషితో మాటాడి రాబట్టిన విషయమేంటంటే.. గవర్మెంటునొప్పించి మొన్న గెలిచిన ఎమ్మెల్లే ఈ ఊరి మీదుగా వంతెన కట్టిస్తున్నాడు. ఈ ప్లాన్లూ గీన్లూ గవర్నమెంటోళ్ళకి నచ్చితే పని మొదలుపెట్టేయడమే.

అనుకున్నదే తడవుగా వంతెన పనులు ఒకేసారి అటూ ఇటూ వైపుల నుండి మొదలైపోయాయ్. లారీలని, ఇసకనీ, సిమెంటు బస్తాలని రేవు దాటించేందుకు వీలుగా పంట్లు కూడా సిధ్ధమైపోయాయ్. పన్లు మొదలైన వారానికొచ్చిన ఛీఫ్ ఇంజినీర్ సత్య ప్రసాదనే మనిషి వెంకబాబు హోటల్లో కాల్చిన దిబ్బరొట్టి తిని మతిపోగొట్టుకున్నంత పనైపోయిందన్నాడు. “పాలకొల్లూ, రావులపాలెంలో చేసి అమ్మే దిబ్బరొట్లు కూడా ఇంత రుచిగా ఉండవయ్యా.. వెంకబాబూ”.అని పొగుడుతుంటే.. ఓ ఇదైపోయిన వెంకబాబు ఆయన ప్లేటునిండా ఎర్రగా మెరిసిపోయే దబ్బకాయ పచ్చడిని కొసరి కొసరి మరీ వడ్డించాడు.

ఉరికే గవర్నమెంటు పనులకే పంట్లు వాడకండా.. రోజుకి నాలుగు ట్రిప్పులు కూడా జనాల్నెక్కించుకుని తిప్పమన్నాడా ఛీఫ్ ఇంజినీరు. “ఇదంతా గవర్నమెంటుకి తెలిత్తే నా ఉజ్జోగం పోతాది కదా…” అనడిగిన పంటు డ్రైవరు సత్యం గత్యంతరం లేక‌, ఇంజినీరు మాట కాదనలేక జనాల దగ్గర కేవుకి డబ్బులు తీసుకుని మరీ దింపేవాడు. ఆ లెక్క అలానే ఇంజినీరుకి అప్పజప్తే, ఆయన ఆ పై ఆఫీసరుకి జమ చేసేవోడు బ్రిడ్జి పనులు జరిగినన్నాళ్ళూ. ఈ పంటు ట్రిప్పులతో చాలా తొరగా రేవు దాటే అవకాశం ఉండటంతో జనం బొత్తిగా పాసింజరు పడవలవైపు చూడ్డమే మానేసారు.

బ్రిడ్జి పనులు పూర్తయ్యే కొద్దీ.. ఇంజినీరు ఇన్స‌పక్షను పేరుతో ఈ రేవొడ్డుకి రావడం, వెంకబాబు హోటల్లో దిబ్బరొట్టీ, పెసరట్టూ అల్లప్పచ్చడిలో అద్దుకు తింటూ ఓ అని మెచ్చుకోవడం జరుగుతూనే ఉంది. వారానికోసారి సంత జరిగే రోజు పడవల్లో రేవు దాటి, కావాల్సిన సరుకుల్ని పక్కూరి టౌను నుండి పొట్లాలు కట్టించుకుని రిక్షాలో రావడం అలవాటు వెంకబాబుకి. ఆ సంతో దుకానాలెట్టేవోళ్ళూ, కిరాణా షాపోళ్ళూ చాలా ఇదిగా మాట్లాడతారు అతనితో. ఇప్పుడూ అతను రేవు దాటతన్నాడు, కాకపోతే పడవల్నొదిలేసి పంటులో పోతున్నాడు. “ఈ బ్రిడ్జి అడితే మనుషులకి సీరియస్సైనపుడు బేగా ఆస్పటలుకి తీసుకెళ్ళిపోచ్చెహే..”, “ఏటా ఒకరో ఇద్దరో పడవలు తిరగడిపోయి గోదారిలో పడిపోయే ఛాన్సులు కూడా తగ్గిపోతాయి కదా బెదరూ..” లాంటి మాటలు వెంకబాబు హోటళ్ళోనే బళ్ళలు మీద కుర్చుని మాటాడుకోసాగారు జనం.

మెల్లమెల్లగా రేవు కనుమరుగైపోవడం మొదలెట్టింది. వంతెన డౌనుకొచ్చేటపుడు అడ్డంగా ఉందని రావిచెట్టుని కొట్టేసారు. దాని కిందుండే ఆంజేయసామి విగ్రహాన్ని ఊళ్ళో ఏదో గుడిలో మూల నుంచోపెట్టారు. ఇపుడా రావిచెట్టు నీడ, రచ్చబండ లేక జనం ఆ పక్కన నుంచోడమే మానేసారు. ఇపుడనవసరంగా వాళ్ళ మీద చెట్టు పైన కుర్చుని రెట్టలేసే పిట్టలేం లేవు. పైగా వంతెన దిగే చోటు కాబట్టి గవర్మెంటోళ్ళే సిమెంటుతో బస్సు షెల్టరు కడుతున్నారు‌, ఎంత సుకం!

ఇపుడు వంతెన ఓపెను జేసేసారు ముక్యమంత్రి చేతుల మీద. ఆ పదూళ్ళనీ కలుపుతూ బస్సు కూడా వేసేసారు. ఇంకా బస్సులు అలవాటవ్వని జనమే రేవులోకొచ్చి పాసింజరు పడవల కోసం చూత్తన్నారు. ఇదివరకట్లా కాకండా ఇపుడు ఇద్దరు మాత్రమే ఇంకా పాసింజరు పడవలు నడుపుతున్నారు. మిగతావోళ్ళంతా చేపల వేటకో, అంతర్వేది తీర్థాల లాంటి ట్రిప్పీలకో బేరాలొచ్చినపుడెళ్తున్నారు. ఇంతకు ముందులా జనం ఇపుడు వెంక బాబు ఒటెళ్ళో త్రీ రోజెస్ స్ట్రాంగుటీ కోసం ఎదురు చూడట్లేదు. బస్సులోనే కాబట్టి తొరగా అద్దరికి వెళ్ళిపోయి అన్నపూర్ణా టీస్టాల్‌లో తాగుతున్నారు. పెనం మీద దోశెలు గట్టిగా పది కూడా వేసే అవసరం రాపోడంతో వెంకబాబు ఆ ఒటేలు బళ్ళల మీదే కాశీ తువ్వాలు తలకింద పెట్టుకుని పడుకుంటున్నాడు.

బ్రిడ్జి పూర్తి అందుబాటులోకి వచ్చేసింది కాబట్టి, చదువుకునే పిల్లలంతా ఆర్టీసి బస్సు పాసులు తీసుకుని అందులో జమ్మని వెళ్ళిపోతున్నారు. ఆ బ్రిడ్జి కట్టించి జనాల కష్టాలు తీర్చాడు కాబట్టి వచ్చీసారి కూడా ఈయనే ఎమ్మెల్లే అని అందరూ అనుకుంటున్నారు. ఏటిగట్టున కొట్టు తీసేయడంతో.. రబ్బరు టైర్లతో చేసిన చెక్కబండి మీద సోడాకాయలేసి ఇంటింటికీ తిరిగి అమ్ముకుంటున్నాడా నాగేస్సర్రావ్. కావాలంటే పొద్దుటా సాయంత్రం బస్సు మీద రావొచ్చని చెప్పి టౌనుకి కుటంబంతో సహా మకాం మార్చేసాడు ఆ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టరు. ఊళ్ళో ఇంకెక్కడ పెట్టినా రాబడి లేపోడంతో హోటలు పెట్టడం అంటేనే భీభత్సమైన లాసని నిర్ణయానికొచ్చేసాడు వెంకబాబు. ఎన్నోసార్లు ఆనందంగా, రుచికరంగా అట్లూ వంటలూ చేసిన చేతితో.. టౌనులో తను సరుకులు కొనే కిరాణా కొట్లోనే పొట్లాలు కట్టే పనిలో కుదిరిపోయాడా వెంకబాబు. ఇంత జేసినా ఆ కాశీ తువ్వాలు భుజం మీదనో, తలకి కట్టుగానో వాడటం మాత్రం మానలేదు. ఒకపుడు ఏటిగట్టు, రేవు అని పిలిచిన ఆ చోటు మాత్రం ఇపుడు బ్రిడ్జి కింద ఓ అనామక స్థలంలా మిగిలిపోయింది. ఒకప్పటి వెంకబాబు ఒటేలు పాకలో ఇపుడు ఒకటో రెండో పందులు పిల్లలు పెట్టి దొర్లుతున్నాయి!

Written By Vinod Krishna