Idream media
Idream media
గోవాలో కాంగ్రెస్ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది.అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ హస్తం నుండి మరో వేలు విడిపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యే,మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ ఇవాళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను సమర్పించారు.
2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమలం దెబ్బకు గోవా కాంగ్రెస్ కుదేలైంది.ఆ షాక్ నుండి కోల్పోక ముందే టీఎంసీ కాంగ్రెస్ నేతలను తన బుట్టలో వేసుకుంది. తాజాగా మరోసారి కమలం తన ఆకర్షణ మంత్రాన్ని కాంగ్రెస్‌పై ప్రయోగించింది.దీంతో పోండా స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రవి నాయక్ తన రాజీనామాను శాసనసభ స్పీకర్ రాజేష్ పట్నేకర్‌కు సమర్పించారు. గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో రవి నాయక్ బీజేపీలో చేరే అవకాశం ఉంది.ఇప్పటికే ఆయన ఇద్దరు కుమారులు ఏడాది కాలంగా కాషాయ దళంతో కలిసి పనిచేస్తున్నారు.తాజాగా రవి నాయక్ రాజీనామాతో 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ బలం మూడుకు పడిపోయింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.అయితే 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ సముద్రతీర (కోస్తా) రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులతో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత “ఆపరేషన్ లోటస్” పేరుతో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంతో ఆ పార్టీని వీడి కాషాయం కప్పుకున్నారు.
గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాల్పోయి ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మొదటి వ్యక్తి. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన అదే స్థానం నుంచి ఉప ఎన్నికలో విజయం సాధించారు. ప్రస్తుతం విశ్వజిత్ రాణే ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. ఆయన నిష్క్రమణ తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చారు. శిరోడా, మండ్రేమ్ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సుభాష్ శిరోద్కర్, దయానంద్ సోప్తే బీజేపీలో చేరడానికి పార్టీని విడిచిపెట్టారు.వారిద్దరూ మే 2019లో జరిగిన ఉప ఎన్నికలలో కమలం గుర్తుపై విజయం సాధించారు.
గోవా కాంగ్రెస్‌కు 2019 జూలైలో అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది.అప్పటి ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలోని 10 మంది ఎమ్మెల్యేల బృందం పార్టీని వీడింది. ప్రస్తుతం ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో కవ్లేకర్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.ఇక గత అక్టోబర్‌లో గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజిన్హో ఫలేరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకొని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల నాటికి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలైన కాంగ్రెస్ వైపు నిలబడతారా లేక తమ దారి తాము చూసుకుంటారో అన్న సందేహం పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతోంది.