iDreamPost
iDreamPost
ప్రజాస్వామ్యానికి మూలాధారం ఓటు. ఈ ఓటును సద్వినియోగం చేసుకోలేకపోవడం అంటే ‘కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే’. ఇది ప్రజలతో పాటు నాయకులు, రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. పోలైన మూడోవంతు ఓట్లలో ఎన్నో కొన్ని ఓట్లతో విజయం సాధించేసామని ఛాతీ వెడల్పు చేసి, తొడగొట్టే పరిస్థితిని రాజకీయ పార్టీలు కోల్పోతాయి. మరోవైపు తమను పాలించే వారిని ఎన్నుకునే సదావకాశాన్ని ప్రజలు కూడా దూరం చేసుకున్నవారవుతారు.
దేశంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఉన్న గ్రేటర్ హైదరాబాదులో అత్యంత తక్కువ గణాంకాలతో పోలింగ్ జరగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఇదే విధంగా తక్కువగానే పోలింగ్ జరిగిందని ‘కవరింగ్’ చర్యలు తెరపైకి వస్తున్నప్పటికీ ఇలా జరుగుతుంటే ఎన్నికల కమిషనర్, రాజకీయ పక్షాలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతోందనే చెప్పాలి.
2009 ఎన్నికలోల 42శాతం, 2016లో 45.16శాతం, 2009 సార్వత్రిక ఎన్నికల్లో 58 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికలకు 50.86శాతం, 2019 పార్లమెంటు ఎలక్షన్లకు 39.46శాతం పోలింగ్ నమోదైందన్న లెక్కలను ఇప్పుడు బైటకు తీసి, అప్పటితో ఇప్పుడు జరిగిన పోలింగ్‌ను పోల్చి చూస్తున్నారు. నిజానికి ఈ ఎన్నికలన్నింటిలోనూ కనీసం 60 శాతం కూడా పోలింగ్ దాటలేదనే చెప్పాలి. మెట్రో సిటీల్లో ఒకటిగా ఉన్న గ్రేటర్ హైదరాబాదు నగరంలోనే ఇటువంటి పరిస్థితి కొనసాగడానికి కారణాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇందులో రాజకీయ పక్షాలతో పాటు, ఎన్నికల కమిషన్ బాధ్యతను కూడా ఎత్తి చూపుతున్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నిర్వహిస్తున్న ఎన్నికల్లో, అందులోనూ అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉన్న నగరంలో ఇంత తక్కువ పోలింగ్‌శాతంతో ఎన్నికల నిర్వహణ ద్వారా ఇతర ప్రాంతాలకు ఎటువంటి సందేశాన్నిస్తున్నారన్న ప్రశ్నకు ఆయా వర్గాలు సమాధానం చెప్పక తప్పని పరిస్థితి.
నిన్నగాక మొన్న జరిగిన అమెరికా ఎన్నికల్లో లోటు పాట్లు ఎత్తి చూపుతూ మన దేశంలో జరిగే ఎన్నికల గొప్పదనాన్ని అందరూ వేనోళ్ళ పొగిడేసారు. అమెరికాలో కౌంటింగ్ ప్రక్రియలో ఆలస్యమై విమర్శల పాలైంది. కానీ ఇక్కడ మాత్రం కనీసం పోలింగ్ తక్కువగా నమోదై విమర్శలను భరించాల్సి వస్తోంది. ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న భారతదేశ ఎన్నికల వ్యవస్థ గొప్పదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు పరిరక్షించాలంటే బాధ్యతగా ఓటు వేయడం ఒక్కటే మార్గం. ఈ దిశగా ప్రజల్లో చైతన్యం కల్గించడం ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాల ముఖ్య లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.