Idream media
Idream media
ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఎన్ని పనులున్నా ఆ రోజు తప్పనిసరిగా ఓటు వేయడమనేది మన విధి. అందుకోసమే ప్రభుత్వాలు కూడా ఆ రోజు సెలవు ప్రకటిస్తాయి. కానీ కొందరు సెలవును సెలవుగానే భావించి ఆటవిడుపు కోసమే వినియోగించుకుంటారు కానీ ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లకెళ్లరు. అది సరికాదని నిపుణులు, రాజకీయ పార్టీ నేతలు ఎన్నో సార్లు చెబుతూనే ఉంటారు. అదలా ఉంటే.. ఈసారి ప్రత్యేక పరిస్థితుల నడుమ గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉంది. అయితే కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయినప్పటికీ.. వైరస్ ముప్పు పూర్తిగా తొలగలేదని గుర్తుంచుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాధ్యతాయుతంగా వెళ్తున్న పౌరులు కరోనా నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే మంచిది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసింది. పౌరులుగా మనమూ వాటిని పాటించాలి. జీహెచ్‌ఎంసీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ లకు వెళ్లే వారందరూ తప్పనిసరిగా ధరించాలి. ఆయా కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలి. వైరస్ లక్షణాలు స్పల్పంగా ఉన్నా టెస్టులు చేయించుకోవాలి. తెలంగాణలో నవంబరు నెలలో చాలా తక్కువ కేసులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ రేటు 6 నుంచి 3.8కి తగ్గిందన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కేసులు తక్కువేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల పరీక్షలు చేయగా, 2.62 లక్షలు కేసులు నమోదయ్యాయని, అందులో హైదరాబాద్‌లోనే 1,12,892 కేసులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మన జాగ్రత్తల్లో మనం ఉండడం మంచిది.
ప్రభుత్వం తగిన ఏర్పాట్లు
కొవిడ్ 19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టింది. ఈ సారి గ్రేటర్ ఎన్నికలకు 19 మంది హెల్త్ నోడల్ ఆఫీసర్లను నియమించింది. సిబ్బంది కోసం ఒక్కో పోలింగ్ కేంద్రానికి పది చొప్పున మొత్తం 120,000 కిట్‌లను అందుబాటులో ఉంచింది. అలాగే శానిటైజర్ సీసాలు పోలింగ్ కేంద్రానికి ఐదు చొప్పున (500 ఎంఎల్) 60,000 సీసాలను ఏర్పాటు చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఈసారి పోలింగ్ సమయాన్ని కూడా ఓ గంట పొడిగించింది. ఈ నేపథ్యంలో పౌరులు కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.