iDreamPost
android-app
ios-app

నాటి నుంచి నేటి వ‌ర‌కూ గ్రేట‌ర్ మేయ‌ర్ పీఠం చ‌రిత్ర

నాటి నుంచి నేటి వ‌ర‌కూ గ్రేట‌ర్ మేయ‌ర్ పీఠం చ‌రిత్ర

ఇటీవ‌లే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ ఎన్నిక పూర్త‌యింది. రాజ్య‌స‌భ ఎంపీ కె.కేశ‌వ‌రావు కుమార్తె గ‌ద్వాల విజ‌ల‌య‌క్ష్మిని మేయర్ పీఠం వ‌రించిన విష‌యం తెలిసిందే. ఇప్పటి వరకు ఎంసీహెచ్‌, జీహెచ్‌ఎంసీలో నలుగురు మహిళలు మేయర్లుగా పని చేశారు. విజ‌య‌ల‌క్ష్మి ఐదో మ‌హిళా మేయ‌ర్ కావ‌డం విశేషం. 1962-63 లో మొదటి సారి మహిళా మేయర్‌గా రాణి కుముదినీ దేవి ప‌ని చేశారు. రాజ‌కీయాల్లో స‌రికొత్త నాందికి ప‌లికారు. రెండో మహిళా మేయర్‌గా 1965-66 లో సరోజిని పుల్లారెడ్డి, మూడో మహిళా మేయర్‌గా 1968 -69లో బి.కుముద్‌ నాయక్ , నాలుగో మహిళా మేయర్‌గా 2009-2011 బండ‌ కార్తీకరెడ్డి జీహెచ్‌ఎంసీ మేయర్లుగా ఎంపికయ్యారు.

1869లో మొద‌లైన మున్సిప‌ల్ పాల‌న కాల‌క్ర‌మంలో హైద‌రాబాద్ లో పెరుగుతూ వ‌చ్చింది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాట‌వుతూ వ‌చ్చాయి. 1937లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల‌ను క‌లిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఆవిర్భ‌వించింది. 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఆరేళ్ల పాటు సికింద్రాబాద్ లో మున్సిప‌ల్ పాల‌న కొన‌సాగింది. అనంత‌రం 1951లో దానికి కార్పొరేష‌న్ హోదా వ‌చ్చింది. మొద‌ట్లో ఏడాది, రెండేళ్ల పాటు మాత్ర‌మే మేయ‌ర్లుగా కొన‌సాగారు. ఎంసీహెచ్‌ ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటివరకూ అస్థిర పాలనే కొనసాగింది. ఎప్పడూ రాజకీయ పంపకాల్లో భాగంగా మేయర్‌ పదవి వివాదాస్పదంగా నిలుస్తూ వస్తున్నది. 1952 నుంచి 1970 వరకు మేయర్‌గా పని చేసినవారందరూ ఏడాది నుంచి మూడేండ్లకు మించి పదవిలో కొనసాగిన దాఖలాలు లేవు. ఆ తర్వాత 1970 నుంచి 1986 వరకు అంటే 16 ఏండ్ల పాటు అసలు కార్పొరేషన్‌కు ఎన్నికలే నిర్వహించలేదు. అటు తరువాత 1991 నుంచి 2002 వరకు అదే పరిస్థితి. 2007 నుంచి 2009 వరకూ ప్రత్యేక పాలన కిందనే హైదరాబాద్‌ కార్పొరేషన్‌ కొనసాగింది. 2014లో తొలిసారిగా పూర్తిస్థాయి మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఐదేండ్లపాటు సుస్థిరమైన పాలనను అందించింది.

1952 – 54 కాలంలో మాడపాటి హనుమంతరావు తొలి మేయ‌ర్ అయ్యారు. అక్క‌డి నుంచి పాల‌క మండ‌లి పాల‌న కొన‌సాగుతూనే ఉంది. 1954 – 55 వ‌ర‌కు ఏడాది మాత్ర‌మే ధరణీధర్‌ సంఘి మేయ‌ర్ అయ్యారు. 1955 – 56లో షాబుద్దీన్‌ అహ్మద్‌ఖాన్‌, 1956 – 58లో కిషన్‌ లాల్‌, 1958 – 59లో కృష్ణస్వామి ముదిరాజ్‌, 1959 – 60 లో రోషన్‌ అలీఖాన్‌, 1960 – 61లో వేదప్రకాష్‌ దోషజ్‌, 1961 – 62 కాలంలో రామూర్తి నాయుడు, 1962 – 63 కాలంలోరాణి కుముదిని దేవి మొద‌టి మ‌హిళా మేయ‌ర్ గా ప‌ద‌వి పొంది కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు. 1963 – 64లో బనారస్‌ లాల్‌ గుప్తా, 1964 – 65లో ఎం ఆర్‌ శ్యామ్‌రావు, 1965 – 66 సరోజిని పుల్లారెడ్డి , 1966 – 67 అక్బర్‌ అలీ అన్నారీ, కె.కొండారెడ్డి (1968 – 68), బి.కుముద్‌ నాయక్ (1968 – 69), ఎన్‌. లక్ష్మినారాయణ (1969 – 70), ప్రకాష్‌ రావు(1986 – 87), ఎంకె మోబీన్ (1987 – 88 ), అనుములు సత్యనారాయణరావు (1988 – 89), 1989 – 90 (జుల్ఫీకర్‌ అలీ), అలంపల్లి పోచయ్య (1990 – 91), తీగల కృష్ణారెడ్డి (2002 – 07), బండ కార్తీకరెడ్డి (2009 – 11), మాజిద్‌ హుస్సేన్ (2012 – 14), బొంతు రామ్మోహన్ (2015 – 21) ఇప్ప‌టి వ‌ర‌కూ మేయ‌ర్లుగా కొన‌సాగుతూ వ‌చ్చారు. తాజాగా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి మేయ‌ర్ గా ఎన్నిక‌య్యారు.