Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ఈ రోజు 26వ డివిజన్‌లో రీ పోలింగ్ జరగనుంది. ఈ నెల 1వ తేదీన జరిగిన ఎన్నికల్లో మలక్‌పేట డివిజన్‌లో పార్టీల గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. సీపీఐ, సీపీఎం గుర్తులు కంకి కొడవలి, సుత్తి కొడవలి తారుమారైన విషయం పోలింగ్ జరిగే సమయంలో గుర్తించారు. దీంతో అధికారులు విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ నిలిపివేసిన ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా రీపోలింగ్ ఈ రోజు నిర్వహిస్తోంది. రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
గత మూడు ఎన్నికల కన్నా ఈ సారి గ్రేటర్‌లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 149 డివిజన్లకు గాను 46.55 శాతం పోలింగ్ నమోదైంది. 2002 ఎన్నికల్లో 43.27 శాతం, 2009లో 42.92 శాతం, 2016లో 45.27 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఈ దఫా ఎన్నికల్లో ఇప్పటికే వీటి కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు జరిగే ఓల్ట్ మలక్‌పేట డివిజన్ పోలింగ్ పూర్తయితే 46.55 శాతం మరికొంత పెరగనుంది. ఈ మార్క్ 47 క్రాస్ చేస్తుందనే అంచనాలున్నాయి.
రీ పోలింగ్ జరిగేది ఒక్క డివిజన్‌లోనే కావడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటికే రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఎవరికి వారు 149 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయోనన్న లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఓల్ట్ మలక్‌పేట డివిజన్ ఎన్నికల పూర్తిపై మీడియా, సర్వే సంస్థలు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ ఎప్పుడు పూర్తవుతుందోననేలా గంటలు లెక్కపెట్టుకుంటున్నాయి. రీ పోలింగ్ పూర్తయిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి చేయాల్సి ఉంది. ఈ నెల 1వ తేదీన 26వ డివిజన్‌లో పోలింగ్ వాయిదా పడకపోయి ఉంటే.. ఆ రోజే మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించేవి. కానీ గుర్తులు తారుమారు కావడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆంక్షలు నెలకొన్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, రేపు ఉదయం ఫలితాలు వెల్లడికానున్నాయి.