Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు 30 ప్రాంతాలలోని 158 కేంద్రాలలో కౌంటింగ్ ప్రారంభమైంది. 8,152 మంది సిబ్బంది కౌటింగ్లో పాల్గొంటున్నారు. ప్రతి డివిజన్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్‌కు 1000 ఓట్లు కేటాయించనున్నారు. 25 ఓట్ల చొప్పన కట్టలు కట్టనున్నారు. దీంతో ప్రతి రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కించనున్నారు. మొదటి రౌండ్ ఉదయం 10:30 నుంచి 11 గంటల లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. రెండో రౌండ్ 12 గంటలకు వస్తుందని భావిస్తున్నారు.
136 డివిజన్లలో 28 వేల లోపే ఓట్లు పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్ కల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11,818 అత్యల్ప ఓట్లు నమోదైన మెహిదీపట్నం డివిజన్ ఫలితం మొదట రానుంది. మొదట 1926 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల కల్లా 150 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ ప్రారంభం కావడంతో అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది. మరో వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి నెలకొంది.
మొత్తం 150 డివిజన్లకు పోలింగ్ జరిగింది. 1.123 అభ్యర్థులు పోటీలో నిలిచారు. దాదాపు 74 లక్షల ఓట్లకు గాను 46.55 శాతం పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను కల్పించారు. పాస్ ఉన్న వారినే కౌంటింగ్ కేంద్రాలలోకి అనుమతిస్తున్నారు.