సోషల్ మీడియాని ఊపేసిన టాపిక్స్

ఈ మధ్య సినిమా పరిశ్రమకు సంబంధించి అసలు కంటే కొసరు అంశాలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్ గా మారుతున్నాయి. ఇవి ఎంత దూరం వెళ్తున్నాయంటే ఏకంగా న్యూస్ ఛానల్స్ గంటల తరబడి లైవ్ డిబేట్లు పెట్టేంత. కేవలం వారం రోజుల గ్యాప్ లో నెటిజెన్లు వాదోపవాదాలు చేసుకున్న అంశాలు రెండున్నాయి. మొదటిది మెగాస్టార్ చిరంజీవి మీద ప్రవచనకర్త గరికపాటి వారు ఆడిన రుసరుసలు. ఈ వివాదం మీద ఇద్దరూ మౌనంగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం దీని గురించి డిస్కషన్లు పెడుతూనే ఉన్నారు. ఇందులో చిరు తప్పేమీ లేకపోవడంతో ఫైనల్ టార్గెట్ గరికపాటి వారే అయ్యారు. ముందు సెటైర్ ట్వీట్ వేసిన నాగబాబు తర్వాత ఏదో సర్దే ప్రయత్నం చేశారు.

ఈ ఇష్యూకి సంబంధించి అటు గరికపాటి కానీ చిరంజీవి కానీ ఎక్కడ మాట్లాడలేదు. మొన్న జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో అనంత శ్రీరామ్, చోటా కె నాయుడు, దర్శకుడు బాబీ తిరిగి ఈ కాంట్రోవర్సీ జోలికొచ్చి కొందరు స్మూత్ గా కొందరు ఘాటుగా ఏదేదో అనేయడంతో ఎవరు కరెక్ట్ అనేదాని మీద ఫేస్ బుక్, ట్విట్టర్ లో నువ్వా నేనా అని ఫ్యాన్స్ పోట్లాడుకున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో ఇది చల్లారిపోతుంది కానీ అవసరానికి మించిన మైలేజ్ వచ్చిందన్నది వాస్తవం. ఇక రెండోది నయనతారకు కవలలు పుట్టిన టాపిక్. ఏదో నిన్నా మొన్నా పెళ్లి జరిగినట్టు ఆ విజువల్స్ ఇంకా ఫ్రెష్ గా ఉండగానే హఠాత్తుగా ట్విన్స్ పుట్టారని ప్రకటించడం నిజంగా షాకే.

సరోగసి విధానం ద్వారా జరిగినట్టు తర్వాత క్లారిటీ ఇచ్చేశారు కానీ ఈలోగా బోలెడన్ని మీమ్స్ వచ్చి పడ్డాయి. ఎప్పుడో 2010లో వచ్చిన అదుర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ నయనతారతో మచ్చల శాస్త్రం ప్రకారం నీకు కవల పిల్లలు పుడతారని చెబుతాడు. ఇప్పుడు అదే నిజమయ్యేసరికి ఆ వీడియో కాస్తా వైరల్ అయిపోయింది. అంతే కాదు విక్రమ్ ఇంకొకడులో సైతం ఇలాంటి డైలాగే ఉంటుంది. తొమ్మిది నెలల కంటే ముందుగా పిల్లలు కావాలని నయన్ తో చెప్పే మాటది. ఏదైతేనేం సినిమాల ఫలితాలు, రికార్డులు, కలెక్షన్లు, థియేటర్ రెస్పాన్సుల కన్నా ఇలాంటివి బాగా వెళ్లడం వింతే. అయినా జనానికి టైంపాస్ కి టాపిక్స్ కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటివే కరెక్ట్ గా సెట్ అవుతాయి.

Show comments