కన్న బిడ్డ బతికుండగానే శ్రద్ధాంజలి ఘటించిన తల్లిదండ్రులు.. కారణమిదే!

తల్లిదండ్రులు తాము బతికున్నన్ని రోజులు బిడ్డల బాగోగుల గురించే ఆలోచిస్తారు. తమ కళ్ల ఎదుట కన్నబిడ్డలకు చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు. తమ ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా బతకాలని కోరుకుంటారు. తమకు చేతనైనంతలో పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లిదండ్రులు కూడా ఇదే కోవకు చెందినవారే. కుమార్తె అంటే వారికి అంతులేని ప్రేమం. చిన్నప్పటి నుంచి బిడ్డను ఎంతో గారబంగా, అపురూపంగా పెంచుకున్నారు. ఆమె లోకంగా బతికారు. బిడ్డను అంతలా ప్రేమించిన ఆ తల్లిదండ్రులు.. ఎవరూ ఊహించని పని చేసి అందరికి షాక్‌ ఇచ్చారు. బిడ్డ బతికుండగానే ఆమెకు శ్రద్ధాంజలి ఘటించి.. మృతి చెందిందని ప్రకటించి.. అందరికి షాక్‌ ఇచ్చారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కుమార్తె బతికుండగానే.. ఆమె తల్లిండ్రులు ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. జీవించి ఉన్న కుమార్తెకు శ్రద్ధాంజలి తెలుపుతూ ఆమె ఫొటోతో పోస్టర్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. తల్లిదండ్రుల తీరుపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఆ తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా.. కుమార్తె ప్రేమ వ్యవహారం. అవును అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ.. తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో.. ఆమె తల్లిదండ్రులు.. కూతురు బ్రతికుండగానే శ్రద్ధాంజలి అంటూ పోస్టర్స్ ఏర్పాటు చేశారు.

గద్వాల్‌ జిల్లాకు చెందిన సోమేశ్వరి డాక్టర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు కానిస్టేబుల్‌ రాజశేఖర్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, తల్లిదండ్రులను ఒప్పించాలని ప్రయత్నించారు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న సోమేశ్వరి తల్లిదండ్రులు.. తమకు చెప్పకుండా పెళ్లి చేసుకుందనే కారణంతో కూతురిపై పగ పెంచుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమ కూతురు చనిపోయిందని చెబుతూ శ్రద్ధాంజలి పోస్టర్లను ఏర్పాటు చేశారు.

శ్రద్ధాంజలి పోస్టర్లను సోషల్ మీడియాలో వైరల్ చేసి బంధువులకు కూడా పంపించారు. ఇవి చూసి బంధువులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ పోస్టర్ల వ్యవహారం సోమేశ్వరి దంపతులకు తెలియడంతో చివరకు వారు పోలీసులకు ఆశ్రయించారు. తమ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను కాపాడాలని గద్వాల్ టౌన్ పోలీసులను కోరారు. దీంతో తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బతికున్న బిడ్డ చనిపోయిందంటూ చెప్పి ఇలా శ్రద్దాంజలి పోస్టర్లు ఏర్పాటు చేయడం మాత్రం దారుణం అంటున్నారు స్థానికులు.

Show comments