ప్రపంచంలో అనేక దేవాలయాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ధనం, సంతానం, సౌభాగ్యం, చదువులు వంటి వాటి కోసం ప్రత్యేక దేవాలయాలు ఉంటాయి. అలా కోరిన కోర్కెలు నెరవేర్చే దేవాలయాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ విడాకులకు కూడా దేవాలయం ఉందంటే నమ్ముతారా?. అవునూ డైవర్స్ టెంపుల్ కూడా ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
జపాన్ లో మాస్తుగావోకా టోకీజీ అనే ఆలయంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 600 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయానికి దేశంలోనే ఎంతో పేరుంది. ఈ గుడికి ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం స్త్రీ సాధికారత, నవీనీకరణల గురించి సందేశానిస్తుంది. ఈ దేవాలయాన్ని డైవర్స్ టెంపుల్ అని స్థానికులు పిలుచుకుంటారు. 1285లో బౌద్ధ భిక్షువు కాకుసాన్ షిదో-నీ ఈ డైవర్స్ టెంపుల్ నిర్మించారు. తొలినాళ్లు ఈ ఆలయంలో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ అందించే వారు. ఈ గుడి నిర్మాణం జరిగిన కాలంలో మహిళల పరిస్థితి ఘోరంగా ఉండేది.
వారిని సమాజంలో చాలా చిన్న చూపు.. చూసే వారు. సమాజంలో ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. అంతేకాక వారిపై పలు సామాజిక కట్టుబాట్లు విధించేవారు. అటువంటి పరిస్థితుల మధ్య మహిళలు గృహ హింసకు గురయ్యేవారు. అత్తింటి వారు ఇంటి నుంచి గెంటేస్తే.. ఒంటరిగా మిగిలి పోయేవారు. అలాంటి పరిస్థితుల్లో వారు మానసిక ప్రశాంతత కోసం ఈ మందిరానికి వస్తుండేవారు. విడాకుల వ్యవహారాలు కూడా ఎక్కువగా జరుగుతుండేవి. భర్త నుంచి విడిపోయిన మహిళలకు ఇక్కడ విడాకుల ధృవ పత్రాలను అందించేవారు. ఈ సర్టిఫికెట్లు ఒంటరి మహిళలకు స్వేచ్ఛగా ఉండే హక్కును ప్రసాదించేవి. ఈ టోకోజి మందిరం ఒక విజ్ఞాన నిలయంగా కూడా ఉండేది.
దీనిలో ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రతో ముడిపడిన కళాకృతులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. నాటి మహిళల అనుభవించిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే గుర్తులు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయంలో ధార్మిక సమావేశాలు జరుగుతుండేవి. ఇక ఈ ఆలయ పరిసర ప్రాంతాలు పచ్చని ప్రకృతి శోయగాలతో నిండి ఉంది. అక్కడి వచ్చే వారికి ఎంతో ప్రశాంతతను ప్రసాదిస్తుందని చెబుతుంటారు. గుడి ప్రవేశ ద్వారంవైపు వెళ్లే వారికి రాతితో కూడిన రహదారి మార్గం స్వాగతం పలుకుతుంది. మొత్తానికి ఈ డైవర్స్ టెంపుల్ స్థానికంగా మంచి గుర్తింపు పొందింది. మరి.. ఈ ఆలయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.