Dharani
Dharani
నేటి రాకెట్ యుగంలో కూడా ఆడపిల్లల పట్ల వివక్ష మాత్రం సమసిపోవడం లేదు. ఆడపిల్ల అంటే భారంగా భావించే తల్లిదండ్రులు నేటికి కూడా కోకొల్లలు మన సమాజంలో ఎందరో ఉన్నారు. ఆడపిల్లను కనిపెంచి, పెళ్లి చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. అలాంటిది వారికి చదువు ఎందుకు అని భావించే తల్లిదండ్రులు నేటికి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆడపిల్లల చదువును ప్రోత్సాహించడం కోసం అనేక రకాల పథకాలను తీసుకువచ్చాయి. ఆడపిల్లల కోసం ఇప్పటికే సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆడపిల్లల చదువును ప్రోత్సాహించడం కోసం చాలా ఏళళ్ల క్రితమే స్కీమ్‌ను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా ఆడపిల్ల ప్టుటిన దగ్గర నుంచి 10 తరగతి పూర్తయ్యేవరకు బాలికలకు ఆర్థిక సాయం చేసేందుకును గాను ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాలు..
1997లో ప్రభుత్వం ‘బాలికా సమృద్ధి యోజన’ (బాలిక శిశు సంక్షేమ పథకం) ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచి వారు 10 వ తరగతి పూర్తి చేసేవరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని కింద కుటుంబంలో మొదట్లో ఒక కుమార్తె పుట్టినప్పుడు, తల్లికి ఆర్థిక సహాయంగా రూ. 500 అందుతుంది. తదనంతరం ఆ ఆడపిల్ల పదో తరగతి పూర్తి చేసే వరకు ప్రతి దశలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు.. ఎలా అప్లైయ్ చేయాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు..
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ బాలికా సమృద్ధి యోజన పథకం రూపొందించారు. గరిష్టంగా కుటుంబంలోని ఇద్దరు బాలికలకు ఈ పథకం వర్తిస్తుంది. బాలికా సమృద్ధి యోజనకు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలలో ఆడపిల్ల జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల నివాసం, తల్లిదండ్రులు, బంధువుల గుర్తింపు రుజువుకు సంబంధించిన పత్రాలు అవసరం అవుతాయి. వీటితో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ వంటివి అవసరం కావచ్చు.
బాలికా సమృద్ధి యోజన కోసం దరఖాస్తు చేయడానికి మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే.. ఇందుకు సంబంధించిన పత్రాలు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సేవా కేంద్రాల నుండి పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఎలక్ట్రానిక్ రూపంలో ఫారమ్‌ను ఫిల్ చేసి అప్లై చేయాలి. గ్రామీణ, పట్టణ లబ్ధిదారుల కోసం వేర్వేరు ఫారమ్‌లు ఉంటాయని గుర్తించాలి. ఈ పథకం ద్వారా బాలికల విద్య కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కాలర్‌షిప్ మొత్తం తరగతి వారీగా మారుతుంది. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి 300 ఇస్తారు. దీన్ని క్రమక్రమంగా పెంచుతూ తొమ్మిది, పదో తరగతి వచ్చేసరికి రూ.1000 సాయం చేస్తారు. బాలికా సమృద్ధి యోజన గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ద్వారా నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారులు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు.