iDreamPost
iDreamPost
సొంత గడ్డ మీద సఫారీలు తడబడ్డారు. భారత్ బౌలర్లకు దాసోహం అయ్యారు. వారి ధాటికి తొలి సెషన్ లో వికెట్లు టపటపా రాలిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు వత్తిడికి లోనయ్యింది. తరువాత కోలుకున్నా కీలక సమయంలో మరోసారి వికెట్లు పడిపోవడంతో తొలి టెస్టులో ఎదురీదుతోంది. దక్షణాఫ్రికా అతి తక్కువ పరుగులకే ఔటవ్వడంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది.
దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టు మూడవరోజు మంగళవారం సఫారీ జట్టు కుప్పకూలిపోయింది. రెండవరోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయిన విషయం తెలిసిందే. మూడవ రోజు ఇటు ఇండియా జట్టుతోపాటు అటు దక్షిణాఫ్రికా జట్టు కూడా నిలకడలేని ఆటతీరును ప్రదర్శించాయి. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 197 పరుగులు మాత్రమే చేసి ఆల్‌ఔట్ అయ్యింది. దీనితో భారత్ జట్టుకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ఒక వికెట్టు కోల్పోయి 16 పరుగులు చేసింది. దీనితో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 146 పరుగుల ఆధిక్యతలో ఉంది. భారత్ జట్టులో అగర్వాల్ నాలుగు పరుగులు చేసి ఔటు కాగా, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఐదు పరుగులు, ఠాకూర్ నాలుగు పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రేపటి టీ టైమ్ సమయానికి భారీ స్కోర్ చేస్తే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ద్వారా భారత్ జట్టు సఫారీ జట్టును రెండవ ఇన్నింగ్స్ కు ఆహ్వానించే అవకాశముంది.
దక్షిణాఫ్రికా ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. ఎల్గర్ కేవలం ఒక పరుగు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ మార్‌క్రమ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. పీటర్సన్ సైతం కేవలం 15 పరుగులు చేసి ఔట్ కాగా, డసెన్ కేవలం మూడు పరుగులకే వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా జట్టు ఈ సమయంలో 34 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. తరువాత బవుమా, డీకాక్ కలిసి జట్టును ఆదుకున్నారు. వికెట్ పడకుండా కాపాడుకున్నారు. అయితే వీరద్దరూ కుదురుకుంటున్న సమయంలో 104 పరుగుల వద్ద ఐదవ వికెట్‌గా డికాక్ (34) వికెట్‌ను ఠాకూర్ తీశాడు. తిరిగి 133 పరుగుల వద్ద ఆరవ వికెట్‌గా ముల్డర్ (12) వెనుదిరిగాడు. ఈ వికెట్‌ను షమీ తీశాడు. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద ఉండగా ఏడవ వికెట్‌గా బవుమా (52) ఔటయ్యాడు. తరువాత జాన్సన్ 19 పరుగులు చేసి ఔట్‌కాగా, రబడా 25 పరుగులు, మహరాజ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఎన్గీడీ సున్నా పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత జట్టులో షమీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 44 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు సాధించాడు. బుమ్రా, ఠాకూర్‌లు చెరో రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు.
మూడవ రోజు ఉదయం భారత్ జట్టు సైతం తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలింగ్‌కు చేతులు ఎత్తేసింది. తొలి రోజు 272కు మూడు వికెట్ల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడవ రోజు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత జట్టు రాహూల్ ఔటైన తరువాత వికెట్లు టపటపా రాలిపోయాయి. మూడవ రోజు కేవలం 15.3 ఓవర్లు మాత్రమే భారత్ బ్యాటింగ్ చేసింది. కేవలం 55 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. రాహూల్ 123 (17×4, 1×6) పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడవ రోజు కేవలం ఒక పరుగు మాత్రమే తీసి వెనుదిరిగాడు. భారత్ నాల్గవ వికెట్ 278 వద్ద పడింది. తరువాత బ్యాట్స్‌మెన్ లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రహేనా 48 (9×4), పంత్ 8, అశ్విన్ 4, ఠాకూర్ 4, షమీ 8, బుమ్రా 14, సిరాజ్ 4 పరుగులు (నాటౌట్)తో నిలిచారు. దక్షిణాఫ్రికా జట్టులో ఎంగిడి 71 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు, రబడ మూడు వికెట్లు, జాన్సన్ ఒక వికెట్ తీశారు.