iDreamPost
android-app
ios-app

మోడీకి కొత్త సలహాదారుగా అమిత్ ఖరే.. పదే రోజుల్లో సెక్రటరీ ర్యాంకు పదవి

మోడీకి కొత్త సలహాదారుగా అమిత్ ఖరే.. పదే రోజుల్లో సెక్రటరీ ర్యాంకు పదవి

1985 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ మానవ వనరుల మరియు సమాచార ప్రసార కార్యదర్శి అమిత్ ఖరే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన నియామక ఉత్తర్వులు ఈరోజు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 30న ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన ఖరేని ప్రధాని మోదీకి సలహాదారుగా నియమించే ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందిన ఆయన పది రోజులు తిరగకుండానే సెక్రటరీ ర్యాంకుతో ఏకంగా ప్రధానికి సలహాదారుగా నియమితులవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు.

ప్రధాన మంత్రి మోడీ డైరెక్షన్‌లో 2020 సంవత్సరంలో కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావ‌డంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు డిజిటల్ మీడియా కొత్త మార్గదర్శకాలు తీసుకురావడంలో ఖరే ముఖ్యమైన పాత్ర పోషించారు. అమిత్ ఖేర్ కేంద్ర సెక్రటరీ ర్యాంకులో ఖరే కొనసాగనున్నారు. ప్రధాని సలహాదారులు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్న సమయాన కొత్తగా అమిత్ ఖరే నియామకంతో ప్రాధాన్యత ఏర్పడింది. మోడీ స‌ల‌హాదారులుగా పీకే సిన్హా, అమ‌ర్‌జీత్ సిన్హా, ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణియన్ కూడా వెళ్లిపోయిన క్రమంలో ఖరే ఎంట్రీ ఆసక్తి రేపింది. అమిత్ ఖరే స్వస్థలం జార్ఖండ్ కాగా సర్వీస్ లోకి వచ్చిన కొత్తలో 1995లో ఆయన ఉమ్మడి బీహార్ లో చైబసా జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో దాణా కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు.

ఆ కేసులో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక బీహార్ క్యాడర్ నుంచి కేంద్ర సర్వీసులకు వచ్చిన ఖరే ఢిల్లీలో కీలక పదవులు చేపట్టారు. పూర్తి పారదర్శకతతో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అధికారిగా గుర్తింపు పొందిన ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడైన బ్యూరోక్రాట్లలో ఒకరిగా మారారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వ్యవహారాలను ఏకకాలంలో నిర్వహించిన కొద్దిమంది కార్యదర్శులలో ఖరే ఒకరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనను ఏ మేరకు విశ్వసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Also Read :  గ్యాస్ @ 2657, లీటర్ పాలు @ 1195.. భయమేస్తోందా?