ఈనెల 14 నుండి గాలిలోకి లేవనున్న విమానాలు.. రైలు ప్రయాణాలపై నో క్లారిటీ..

  • Published - 08:03 AM, Sat - 4 April 20
ఈనెల 14 నుండి గాలిలోకి లేవనున్న విమానాలు.. రైలు ప్రయాణాలపై నో క్లారిటీ..

దేశవ్యాప్తంగా డొమెస్టిక్‌‌ విమానాల బుకింగ్స్ ఈ నెల 14 తర్వాత నుంచి మొదలవుతాయని ఏవియేషన్ మంత్రి హర్‌‌‌‌దీప్ సింగ్ పురి తెలిపారు. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ఈనెల 14 వరకు లాక్‌‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌‌డౌన్ కారణంతో అన్ని విమానాలు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. లాక్‌‌డౌన్ మరిన్ని రోజులు పొడిగించకపోతే డొమెస్టిక్ బుకింగ్స్‌‌ను ఎయిర్‌‌‌‌లైన్స్ చేపడతాయని మంత్రి తెలిపారు. రిపోర్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనతో పాటు ఈ కాన్ఫరెన్స్‌‌లో సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ ఖరోలా పాల్గొన్నారు.

లాక్‌‌డౌన్ ఎత్తివేసిన తర్వాతనే విదేశాల్లో చిక్కుకున్న ఇండియన్లను తీసుకొచ్చేందుకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌‌ను పంపిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. లాక్‌‌డౌన్ తర్వాత దశల వారీగా ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌‌ ఆపరేషన్స్‌‌కు అనుమతిస్తామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌‌డౌన్‌‌తో అన్ని రవాణా సర్వీసులు, వ్యాపారాలు బంద్ అయ్యాయి.

అయితే లాక్‌‌డౌన్‌‌ను పొడిగించే ఉద్దేశమైతే ఇప్పటి వరకైతే లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన నెపధ్యంలో ఇతర దేశాల్లో పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయని తెలిశాకే ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌‌కు అనుమతి ఇస్తామని ఖరోలా తెలిపారు. వైరస్ వ్యాప్తి విదేశీయుల ద్వారానే ఎక్కువగా ఉందని వెల్లడి కావడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రస్తుతానికి ఫారినర్స్‌‌ ఎంట్రీని ఆపేశాయి. అయితే లాక్ డౌన్ నెపధ్యంలో భారీగా నష్టాలు చెవిచూసిన ఏవియేషన్ ఇండస్ట్రీకి ఇచ్చే బెయిల్ అవుట్ ప్యాకేజీపై మంత్రి స్పందించలేదు.

కాగ, రద్దయిన ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పునఃప్రారంభంపై ఏప్రిల్‌ 12 తర్వాతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని రైల్వేశాఖ పేర్కొంది. రైల్వే టికెట్ల బుకింగ్‌ ప్రక్రియ ఎప్పుడూ నిలిచిపోలేదని, 120 రోజుల ముందు నుంచే రైల్వే రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ తర్వాత ప్రయాణికులకు బుకింగ్స్‌ మొదలయ్యాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ ప్రకటన చేయడం విశేషం. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 14 వరకు మాత్రమే ప్రయాణాల బుకింగ్స్‌ను నిలిపివేసినట్లు రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.

ఇప్పటికే ఏప్రిల్‌ 14 వరకు రైళ్లను నిలిపివేస్తూ రైల్వే శాఖ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ గడువులోనే ఆన్‌లైన్, కౌంటర్లలో రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం నిలిపివేసింది. గూడ్స్, సరుకు రవాణా రైళ్లు తప్ప మిగిలినవన్నీ రద్దు చేసింది. సాధారణంగా వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని 120 రోజుల ముందుగానే రిజర్వేషన్‌ చేయించుకునే సౌకర్యం ఉన్నందున అధిక సంఖ్యలో ప్రయాణికులు అడ్వాన్స్‌ రిజర్వేషన్లు చేయించుకున్నారు. డిమాండ్‌ ఉన్న రైళ్లలో మార్చి మొదటి వారానికే చాల పెద్ద వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. లాక్‌డౌన్‌పై స్పష్టత ఉంటే ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.

Show comments