iDreamPost
android-app
ios-app

నేడే కౌంటింగ్‌.. గెలుపెవరిది..?

నేడే కౌంటింగ్‌.. గెలుపెవరిది..?

కరోనా సమయంలోనూ హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాలు, తిరుపతి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌ మరికొద్ది సేపటల్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవబోతోంది.

కోవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కౌటింగ్‌ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్‌ రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు కౌటింగ్‌ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్లు, అభ్యర్థులు టీకా వేయించుకోవడం లేదా 48 గంటల ముందు కరోనా నెగిటివ్‌ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. విజయ యాత్రలు, సంబరాలపై నిషేధం విధించింది.

ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌటింగ్‌ సాయంత్రం వరకు జరగనుంది. మధ్యాహ్నం నాటికే ఫలితాల సరళి తేలిపోనుంది. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పాండిచ్చెరి రాష్ట్రాల అసెంబ్లీలకు మార్చి నెలాఖరులో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ గత నెల 29వ తేదీతో ముగిసింది.

బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు 8 దశల్లో, అస్సాంలో 126 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగ్గా.. తమిళనాడులోని 234 స్థానాలకు, కేరళలోని 140 సీట్లకు, పాండిచ్చెరిలోని 30 స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. వీటితోపాటు ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ సహా దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. శాసన సభ ఎన్నికలతోపాటు, ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు జరగనుంది.

29వ తేదీన బెంగాల్‌లో చివరిదైన 8వ విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు తుది ఫలితాలపై ఉత్కంఠను పెంచాయి. బెంగాల్‌లో మళ్లీ దీదీకే ప్రజలు పట్టం కట్టారని మెజారిటీ సర్వే సంస్థలు తేల్చాయి. అస్సాంలో బీజేపీ కూటమి మళ్లీ అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. కేరళలోనూ అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమికే మళ్లీ ప్రజలు పట్టం కడతారని, తమిళనాడులో ప్రతిక్ష డీఎంకేకు పదేళ్ల తర్వాత అధికారం దగ్గబోతోందని అంచనా వేశాయి.

పాండిచ్చెరిలో ఏ సంస్థా ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రకటించలేదు. నాగార్జున సాగర్, తిరుపతిలలో అధికార పార్టీలు టీఆర్‌ఎస్, వైసీపీ విజయం సాధించబోతున్నాయని పేర్కొన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇలా ఉండగా.. ఎగ్జాట్‌ పోల్స్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మరి కొద్ది గంటల్లోనే తేలిపోతుంది.