iDreamPost
android-app
ios-app

ఆర్బీకేల పటిష్టతకు మరో కీలక నిర్ణయం

  • Published Jan 06, 2022 | 5:05 AM Updated Updated Jan 06, 2022 | 5:05 AM
ఆర్బీకేల పటిష్టతకు మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. గతంలో సాగువేళ రైతులు పడిన ఇబ్బందులకు చెక్‌ పెడుతూ వారి ముంగిటకే కావాల్సిన ఎరువులను అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎరువుల నిల్వకోసం గ్రామస్థాయిలో గోదాములు నిర్మించాలని సంకల్పించింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టిన తర్వాత రైతుల ఇబ్బందులకు తెరపడింది. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి సహకార సంఘాలు, వ్యాపారుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. కానీ నేడు ఎరువులు రైతులు కోరిన వెంటనే లభిస్తున్నాయి. 10,778 ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువుల పంపిణీతో రైతులకు భరోసా లభించింది. గత రెండేళ్లలో ఆర్బీకేల ద్వారా 6.9 లక్షలమంది రైతులకు 3.25 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేశారు.

ఎమ్మార్పీకే లభ్యం..

పేరున్న కంపెనీల ఎరువులన్నింటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడమేకాదు.. సీజన్‌లో రాష్ట్రానికి కేటాయించిన ప్రతి ఎరువును ముందుగా సమగ్ర పరీక్ష కేంద్రంలో పరీక్షించిన తర్వాతే రైతులకు సరఫరా చేస్తుండడంతో నకిలీలకు చెక్‌ పడింది. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదు మేరకు ఎంపిక చేసుకున్న ఎరువులను ఎమ్మార్పీకి పొందే వెసులుబాటు లభించింది. గతంలో మాదిరిగా అవసరంలేని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన ఇబ్బందులు పోయాయి. దూరాభారం తగ్గింది. సమయం ఆదా అవుతోంది. రవాణా, ఇతర ఖర్చుల భారం లేకుండా తమ ముంగిటే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలతో రైతులను దోచుకునే ప్రైవేటు డీలర్ల ఆగడాలకు అడ్డుకట్టపడింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల లభ్యత, ఎమ్మార్పీ పట్టిక అమలుతో మార్కెట్‌లో ఎరువుల ధరల స్థిరీకరణ సాధ్యమవుతోంది.  

ఆర్బీకేలకు లైసెన్సు జారీ..

ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేసేందుకు ఆర్బీకేల పేరిట ఎరువుల లైసెన్సు జారీ చేస్తున్నారు. వివిధ పంటలు సాగవుతున్న 10,698 ఆర్బీకేల పరిధిలో ఎరువులు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు రిటైల్‌ ఫెర్టిలైజర్‌ లైసెన్సుల కోసం 10,592 ఆర్బీకేలు దరఖాస్తు చేశాయి. వీటిలో 10,454 ఆర్బీకేలకు లైసెన్సు జారీచేశారు. 138 ఆర్బీకేలకు లైసెన్సు ఇవ్వాల్సి ఉంది. మరో 106 ఆర్బీకేలు ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉంది.

సరఫరా ఆలస్యం కాకుండా..

హబ్‌ల నుంచి ఆర్బీకేలకు ఎరువుల సరఫరాలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా ప్రత్యేకంగా గోదాములు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 20 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వచేసేందుకు వీలుగా 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఉపాధిహామీ పథకం కింద వీటిని నిర్మించేందుకు అంచనాలు రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు.

ఎరువుల కొరత లేదు

గత రబీ సీజన్‌లో 23.47లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వినియోగం కాగా ఈ ఏడాది 23,44,780 టన్నులు అవసరమని అంచనా వేశారు. ఖరీఫ్‌లో వాడగా మిగిలిన 6,96,938 మెట్రిక్‌ టన్నుల నిల్వలుండగా, కేంద్రం నుంచి గత మూడు నెలల్లో 7,51,706 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రాష్ట్రానికి కేటాయించారు. ఇప్పటివరకు 8,32,011 మెట్రిక్‌ టన్నుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 6,16,632 మెట్రిక్‌ టన్నుల ఎరువులు (యూరియా 2,53,953, డీఏపీ 27,420,  ఎంఒపీ 21,581, ఎస్‌ఎస్‌పీ 50,681, కాంప్లెక్స్‌ 2,58,521, ఇతర ఎరువులు 4,476 మెట్రిక్‌ టన్నుల) అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్‌ నెలకు మరో 3,59,774 మెట్రిక్‌ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించింది.

రైతులకు అందుబాటులో

గతంలో ఎరువులు కావాలంటే రైతులు సమీపంలో ఉన్న టౌన్‌కు వెళ్లి ప్రైవేట్‌ డీలర్‌ వద్ద కొని తెచ్చుకునేవారు. పైగా అడిగిన ఎరువులుండేవి కావు. వారు ఇచ్చినవి తెచ్చుకోవాల్సి వచ్చేది. నాణ్యత తెలిసేది కాదు. కానీ నేడు గ్రామాల్లో ఆర్బీకేలు పెట్టిన తర్వాత ఎరువుల విషయంలో బెంగలేదు. కావాల్సిన ఎరువులు ముందుగానే టెస్ట్‌ చేసినవి ఎమ్మార్పీకే దొరుకుతున్నాయి. రవాణా ఖర్చులు తగ్గడమే కాదు.. సమయం కూడా ఆదా అవుతోంది.