iDreamPost
android-app
ios-app

తండ్రి కొడుకులే కాదు తండ్రి కూతుళ్లు కూడా సీఎంలు అయ్యారు తెలుసా?

  • Published Jul 29, 2021 | 6:51 AM Updated Updated Jul 29, 2021 | 6:51 AM
తండ్రి కొడుకులే కాదు తండ్రి కూతుళ్లు కూడా సీఎంలు అయ్యారు తెలుసా?

దేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పటివి కావు. దాదాపు అర్థ శతాబ్ది క్రితం నుంచే కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వారసత్వాన్ని కొనసాగించినంత మాత్రాన అందరూ పదవుల్లో రాణించలేరు. స్వయం ప్రతిభ ఉంటే తప్ప రాజకీయ చదరంగంలో నిచ్చెనలు ఎక్కలేరు. సుదీర్ఘ కాలం మనలేరు. స్వయం ప్రతిభలేని చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన కొద్ధి కాలానికే తెరమరుగైన ఉదంతాలు ఉన్నాయి.

అదే సమయంలో పలువురు వారసులు అవకాశాలను అందిపుచ్చుకుని తండ్రుల బాటలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇలా సీఎం పీఠాలు అధిష్టించిన కొడుకుల సంగతి పక్కన పెడితే.. కుమార్తెలు కూడా తండ్రి వారసత్వాన్ని అందుకొని పార్టీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా అందలం ఎక్కారు. భారత రాజకీయాల్లో అటువంటి రెండు ఉదంతాలు ఉన్నాయి.

వారసత్వంగా సిఎంలయిన మహిళలు ఆయా రాష్ట్రాలకు తొలి మహిళా సిఎంలే కావడం విశేషం. వీరిలో ఒకరైన శశికళ కాకోద్కర్ 70వ దశకంలోనే ఆ ఘనత సాధించగా.. రెండో వారైన మెహబూబ్ ముఫ్తి ఐదేళ్ల క్రితం సీఎం అయ్యారు. వీరు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలు రెండూ ప్రత్యేకమైనవే. శశికళ కాకోద్కర్ అప్పటికి దశాబ్దం క్రితమే పోర్చుగీసు వలస పాలన నుంచి విముక్తి పొందిన గోవాకు రెండో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక మెహబూబా ముఫ్తి ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన కశ్మీర్ మహిళా పాలకురాలిగా రికార్డు సృష్టించారు. ఇద్దరూ ప్రాంతీయ పార్టీలకు చెందినవారే.. తండ్రుల తదనంతరం పార్టీతో పాటు సీఎం పీఠం అధిష్టించిన వారే.. అంతకు ముందే చట్టసభల సభ్యులుగా అనుభవం గడించిన వారే కావడం విశేషం.

Also Read:సీఎం పీఠంపై తండ్రులు.. తనయులు

గోవా విముక్తి ఉద్యమం నుంచి సీఎం స్థాయికి కాకోద్కర్

గోవా, డయ్యు డామన్ కలిపి ఒకే రాష్ట్రంగా పోర్చుగీసు వలస పాలనలో ఉండేవి. 1961లో వీటికి వలస పాలకుల నుంచి విముక్తి లభించడంతో భారత్లో విలీనమయ్యాయి. రాష్ట్రాంగా మారిన గోవాకు 1963లో తొలి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో గోవాలో బలంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దాని వ్యవస్థాపకుడు దయానంద బందోద్కర్ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

1967, 1972లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి బందోద్కర్ సీఎంగా కొనసాగారు. ఆయన కూతురే శశికళ కాకోద్కర్. పీజీ చేసి సంఘ సేవలో నిమగ్నమైన ఆమె 1967లోనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1972లో తన తండ్రి బందోద్కర్ నేతృత్వంలో ఏర్పడిన ఎంజీపీ ప్రభుత్వంలో మంత్రిగా నియమితులయ్యారు. 1973లో దయానంద బందోద్కర్ సీఎం పదవిలో ఉండగానే మరణించారు. దాంతో ఎంజీపీ అధ్యక్ష పదవిని శశికళ చేపట్టారు. అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలు శశికళను శాసనసభా పక్ష నేతగా ఎన్నికోవడంతో.. 1973 ఆగస్టు 12న గోవా తొలి మహిళా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

1977 ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించిన శశికళ రెండోసారి సీఎం అయ్యారు. అయితే రెండేళ్లకు ఆమెపై ఆశ్రీత పక్షపాతం చూపుతున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి. తన భర్త గురుదత్ కాకోద్కర్ సంస్థలకు రవాణా, సిమెంట్ లైసెన్సులు ఉదారంగా ఇచ్చారని, మరో బంధువుకు కళా అకాడమీ నిర్మాణ బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు మిన్నంటాయి. దానికితోడు ఎమర్జెన్సీ తర్వాత పార్టీలోనూ అంతర్గత విభేదాలు పెరిగాయి. శశికళ తీరును స్వపక్షీయులే వ్యతిరేకించడం మొదలుపెట్టారు.

Also Read:పార్టీ ఏదైనా ఏలూరు మేయర్ ఆమే ఎందుకు ?!

1979 ఏప్రిల్ 23న ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో పలు కోతలు ప్రతిపాదిస్తూ పలువురు సభ్యులు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలు 15-13 ఓట్లతో సభ ఆమోదం పొందడంతో ఆర్థిక బిల్లు వీగిపోయి.. ప్రభుత్వం మైనారిటీలో పడిందని పేర్కొంటూ స్పీకర్ రాష్ట్ర గవర్నర్కు నివేదిక పంపారు. ఈ పరిణామాలతో హతాశురాలైన సీఎం శశికళ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ప్రధాని మొరార్జీ దేశాయిలను కలుసుకున్నారు. జరిగిన పరిణామాలను వివరించారు. అసెంబ్లీని రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో 1979 ఏప్రిల్ 26న గోవాలో ఆరునెలలపాటు రాష్ట్రపతి పాలన విధించడంతో శశికళ అధికారానికి దూరమయ్యారు. 1980లో ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. శశికళ కూడా ఎంజీపీకి రాజీనామా చేసి తన మద్దతుదారులతో సహా కాంగ్రెసులో చేరారు.

ప్రత్యేక పరిస్థితుల్లో సీఎంగా మెహబూబా ముఫ్తి

ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన జమ్మూకాశ్మీర్ రాజకీయాలు అంటే ప్రత్యేకంగా ఉంటాయి. మొదటి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలే అక్కడ ప్రభావం చూపేవి. అటువంటి రాష్ట్రానికి తండ్రీకూతుళ్ళు ముఫ్తి మొహమ్మద్ సయీద్, మెహబూబా ముఫ్తి సీఎంలు కావడం విశేషం.

Also Read: పోలవరం నిధులు కేంద్రం మాట నిలబెట్టుకుంటుందా?

ముఫ్తి మొహమ్మద్ సయీద్ 1950లో డెమోక్రటిక్ నేషనల్ కాన్ఫెరెన్సులో తొలుత చేరారు. 1960లో ఆ పార్టీ నేషనల్ కాన్ఫెరెన్సులో విలీనం అయ్యింది. కాగా 1965లో కాంగ్రెసులో చేరి.. 1972లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో టూరిజం మంత్రిగా చేశారు. 1987లో వి.పి.సింగుతో కలిసి కాంగ్రెసును వీడి జనతాదళ్ లో చేరారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వి.పి.సింగ్ ప్రభుత్వంలో హోంమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ముఫ్తి మొహమ్మద్ రెండో కుమార్తె రుబియా సయీద్ ను కాశ్మీరీ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. ఆమె విడుదల కోసం మిలిటెంట్ల డిమాండ్ మేరకు జైల్లో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులను విడుదల చేయడం అప్పట్లో పెను వివాదంగా మారింది.

1996లో తిరిగి కాంగ్రెస్ గూటికి సయీద్ చేరినప్పుడు ఆయనతోపాటు పెద్ద కుమార్తె మెహబూబా ముఫ్తి కూడా ఆ పార్టీలో చేరి రాజకీయ ఆరంగేట్రం చేశారు.1999లో ఇద్దరూ బయటకొచ్చి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటు చేశారు. 2002 ఎన్నికల్లో పీడీపీ తరఫున 18 సీట్లు సాధించిన సయీద్ కాంగ్రెసుతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పీడీపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేక పోయింది. దాంతో అనూహ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని 2015లో రెండోసారి సయీద్ సీఎం అయ్యారు.

అయితే ఏడాదికే ముఫ్తి మొహమ్మద్ సయీద్ అనారోగ్యం పాలై 2016లో మరణించారు. దాంతో పార్టీ ఎంపీగా ఉన్న మెహబూబాను పీడీపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకోవడంతో ఆమె 2016 ఏప్రిల్ నాలుగో తేదీన సీఎం పదవి చేపట్టారు. పీడీపీ అధ్యక్ష పదవి కూడా స్వీకరించారు. అయితే సంకీర్ణ భాగస్వామి బీజేపీతో తలెత్తిన విభేదాలతో 2018 జూన్ 19న పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. 2019 ఆగస్టులో కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పుడు. మెహబూబాను గృహానిర్బంధంలో ఉంచారు.

Also Read:రైతుల పిల్లలకు వెయ్యి కోట్ల స్కాలర్ షిప్ ప్రకటించిన బసవరాజ్‌ బొమ్మై

దేశంలో ఇప్పుడున్న వారసుల్లో అధికులు కొడుకులే కావటం వలన సమీప భవిషత్తులో మరో మహిళా ముఖ్యమంత్రి రాకపోవచ్చు. శరద్ పవర్ కూతురు సుప్రియా సూలే ఎంపీగా రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారసుల జాబితాలో సుప్రియా మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కేసిఆర్ కుమార్తె కవిత కూడా గతంలో ఎంపీ గా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా పనిచేస్తున్నా ఆవిడ ముఖ్యమంత్రి కావటానికి అనేక సమీకరణాలు కుదరాలి.