Idream media
Idream media
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులతో 5 సార్లు చర్చలు జరిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా 13 రైతు సంఘాలకు చెందిన నేతలతో చర్చలు జరిపారు. కానీ సమస్య కొలిక్కిరాలేదు. ఆరో దఫా చర్చలు రద్దయ్యాయి. మరోవైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారత్ బంద్ అనంతరం కొత్త చట్టాల్లో ఏడు సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రాతపూర్వకంగా ఓ పత్రాన్ని రైతులకు పంపింది. వాటిని రైతు సంఘాలు తిరస్కరించాయి. చట్టాల రద్దు తప్పా వేరే ఆప్షన్స్‌కు తావులేదని తేల్చిచెప్పాయి. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మీడియాతో మాట్లాడుతూ చట్టాలు రద్దు మాత్రం కుదరదని, ఏ అంశంలో ఎలాంటి అభ్యంతరమున్నా దానిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ క్రమంలో ఉద్యమం ఉధృతం చేయడానికే రైతులు నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది.
వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. తాజాగా మంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ఏ చట్టమూ మొత్తంగా లోపభూయిష్టంగా ఉండదని, రైతులవి కేవలం అపోహలేనని, వాటిని సవివరంగా చర్చించి లక్ష్యాలను వివరిస్తామని చెబుతున్నారు. కొత్త చట్టాల వల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి గానీ, ఏపీఎంసీ వ్యవస్థపై గానీ ఎలాంటి ప్రభావమూ పడబోదని తోమర్‌తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న రైల్వే మంత్రి పీయూశ్ గోయల్ చెప్పారు. రెండు వారాలుగా రైతులు వణికించే చలిలో నిరసన కొనసాగించడం సరికాదని, కొవిడ్ ఉధృతి కూడా ఉన్నందున వారు కేంద్ర ప్రతిపాదనలను వెంటనే పరిశీలించాలని తోమర్ కోరారు. రైతులు మాత్రం కేంద్రం ప్రతిపాదనలకు ససేమిరా అంటున్నారు.
రైలు పట్టాలు దిగ్భంధం..?
చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా అనడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిశ్చయించుకున్న రైతులు ఇక రైలు పట్టాలను కూడా ఆక్రమించుకుని రైలు సర్వీసులను దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. దిగ్బంధం ఎప్పటినుంచి చేసేదీ తేదీని సంయుక్త కిసాన్ మంచ్ త్వరలోనే ప్రకటిస్తుందని రైతు నేత బూటా సింగ్ చెప్పారు. డిసెంబరు 10 వరకూ ప్రధానికి గడువిచ్చామని, సరైన రీతిలో స్పందించ లేదని ఆరోపించారు. రైతు క్షేమమే ముఖ్యమనుకుంటే ప్రస్తుతం చేసిన చట్టాలను రద్దు చేసి – రైతు నేతలు, ఇతర మేధావి వర్గాలతో చర్చించి కొత్త బిల్లులకు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశమని, మరి దీనిపై కేంద్రం ఎందుకు చట్టాలు చేస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) నేత బల్బీర్‌సింగ్ రాజేవాల్ ప్రశ్నించారు. వ్యాపారుల కోసమే ఈ చట్టాలు చేసినట్లు కేంద్రం ఒప్పుకుందన్నారు.