Idream media
Idream media
పట్టు పట్టరాదు.. పట్టు విడువరాదు.. అన్నట్లుగా నూతన సాగు చట్టాల రద్దుపై అన్నదాతలు ఉద్యమం సాగిస్తున్నారు. చట్టాల రద్దు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధతే తప్పా.. మరే ఇతర ప్రతిపాదనలను రైతులు అంగీకరించడం లేదు. సాగు చట్టాలను ఏడాదిన్నరపాటు వాయిదా వేసి, సమస్య పరిష్కారం కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. 10వ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర ఈ ప్రతిపాదన చేయగా.. చర్చించి నిర్ణయం చెబుతామని తెలిపి తమలోని ఐక్యతను రైతులు చాటుకున్నారు. తమ మధ్య ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా ఆది నుంచి రైతు సంఘాల ప్రతినిధులు ప్రతి అంశంపై సమష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం సామదానభేదదండోపాయాలను ప్రయోగించినా.. రైతుల ఐక్యత ముందు అవన్నీ తేలిపోతున్నాయి.
సాగు చట్టాల రద్దు ఆందోళనలో ఇప్పటి వరకు 143 మంది అన్నదాతలు అమరులయ్యారు. డిమాండ్లను నెరవేర్చడం ద్వారానే వారికి నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందని రైతు సంఘాలు చేసిన ప్రకటన.. వారి ఉద్యమం లక్ష్యాన్ని తెలియజేస్తోంది. సాగు చట్టాల రద్దు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత తప్పా.. మరే ప్రతిపాదనను రైతుల అంగీకరించే పరిస్థితిలోలేరని కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమవుతోంది. ఈ రోజు శుక్రవారం కేంద్రం, రైతు సంఘాల మధ్య 11వ రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతోంది. కేంద్రం చేసిన ప్రతిపాదనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చించారు. ఈ భేటీ పరిణామాలు ఎలా ఉంటాయో ఈ రోజు జరగబోయే సమావేశంలో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయ పార్టీల జోక్యం, రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అన్నదాల ఉద్యమం సాగుతోంది. రెండు నెలలుగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, ఉద్రేకాలకు లోను కాకుండా రైతన్నలు కొనసాగిస్తున్న నిరసన చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. జాతి పిత మహాత్మా గాంధీ చూపిన బాటలో నడుస్తూ స్వాతంత్ర పోరాటాన్ని అన్నదాతలు తలపిస్తున్నారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున లక్ష ట్రాక్టర్లతో చేయ తలపెట్టిన ర్యాలీపై సుప్రిం కోర్టు కూడా జోక్యం చేసుకోకపోవడం రైతులు చేస్తున్న ఉద్యమం ఎంత శాంతియుతంగా సాగుతుందో తెలియజేస్తోంది. ర్యాలీకి అనుమతి విషయం పోలీసుల పరిధిలోనే ఉందని సుప్రిం చెప్పగా.. పోలీసులు ర్యాలీకి అనుమతించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతులు కోరినట్లు ఢిల్లీ అవుటర్ రింగ్ రోడ్డుపై కాకుండా.. నగరానికి దూరంగా ఉండే కుండ్లీ – మానేశ్వర్– పల్వాల్ ఎక్స్‌ప్రెస్ పై ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ర్యాలీ జరిగే అవకాశం లేకుండానే.. గణతంత్ర దినోత్సవానికి ముందే రైతుల ఆందోళలకు కేంద్రం పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.