iDreamPost
android-app
ios-app

మోదీ కీలక ప్రకటన.. 12 ఏళ్ల తర్వాత చెప్పులు వేసుకున్న రైతు!

మోదీ కీలక ప్రకటన.. 12 ఏళ్ల తర్వాత చెప్పులు వేసుకున్న రైతు!

సమాజంలో చాలా మంది తమ కుటుంబం కోసమే కష్ట పడుతుంటారు. కొందరు మాత్రం సమాజం కోసం కృషి చేస్తుంటారు. అలానే ప్రజల కోసం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు, చేస్తుంటారు. ప్రజల కోసం ప్రభుత్వాలు చేస్తామని చెప్పిన మాట తప్పిన అంశాలను నిరవేర్చేందుకు కృషి చేస్తుంటారు. అంతేకాక ప్రభుత్వం దిగి వచ్చే వరకు వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. అలానే ఓ రైతు కూడా పసుపు బోర్డు ఏర్పాటు కోసం 12 ఏళ్లుగా చెప్పులు లేకుండా తిరిగాడు. తాజాగా ప్రధానమంత్రి మోదీ పసుపు బోర్డుపై కీలక ప్రకటన చేయడంతో 12 ఏళ్ల తరువాత చెప్పులు ధరించాడు. మరి.. ఆ రైతు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా చెప్పులు లేకుండా ఎవరు బయట అడుగు పెట్టలేము. చెప్పులేకుండా నడవడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే.  నిజామాబాద్ మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ముత్యాల మనోహర్ రెడ్డి అనే రైతు మాత్రం గత 12 ఏళ్లుగా చెప్పులు  వేసుకోలేదు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం  కలలు కన్న ముత్యాల మనోహర్ రెడ్డి తన శపథం  చేశాడు. 2009 నుంచి  పసుపు బోర్డు లక్ష్యంగా ఉద్యమాలు జరిగాయని సమాచారం. పసుపు బోర్డు కోసం రైతులు పాదయాత్ర, ఉద్యమాలు చేసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.  పసుపు బోర్డు కోసం ఎంతో మంది రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అలానే పసుపు బోర్డు ఏర్పాటు జరిగే వరకు  చెప్పులు ధరించనని మనోహర్ రెడ్డి శపథం చేశారు. మాట ప్రకారమే చెప్పులు లేకుండా దాదాపు 12 ఏళ్లు నడిచారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డుకు సంబంధించి ప్రకటన చేయడంతో మనోహర్ రెడ్డి చెప్పులు వేసుకున్నారు. మహబూబ్ నగర్ వేదికగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. దీంతో తన కల సాకారం కాబోతుందని మనోహర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు  కోసం కృషి చేసిన నిజామాబాద్  ఎంపీ ధర్మపురి అరవింద్ కు  ఆ రైతు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పసుపు రైతులకు మరింత ప్రయోజనాలు కలిగేలా  చేయాలని ఆయన కోరుకున్నారు. పసుపుకు  గిట్టుబాటు ధర లభించడం లేదని పుసుపు  రైతులు ఎంతో నష్టపోతున్నారని ఆయన  వ్యాఖ్యానించారు. తాజాగా మోదీ తీసుకున్న నిర్ణయంతో రైతుల ఉద్యమాలు  వృథా కాలేదని స్థానికులు చెబుతున్నారు. మరి.. 12 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన ఈ రైతుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.