iDreamPost
android-app
ios-app

కేంద్రం కొత్త ఎత్తుగడ

కేంద్రం కొత్త ఎత్తుగడ

 నూతన వ్యవసాయ చట్టాల విషయంలో అటు కేంద్రం, ఇటు రైతులు పట్టు వీడడం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న నెల రోజులు దాటింది. అయినా వెనక్కి తగ్గడానికి రైతు సంఘాలు సిద్ధంగా లేవు. తాజాగా చర్చల కోసం రైతులు పంపిన ఎజెండా పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో చర్చల విషయంలో మళ్లీ ప్రతిష్ఠంభన నెలకొంది. ఒకవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతు ఆందోళనలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో కేంద్రం కొత్త ఎత్తుగడకు తెరతీసింది. వ్యవసాయ చట్టాలను సమర్థించే శక్తులను ఒక్కటి చేసే పనిలో పడింది. తాజాగా వ్యవసాయ చట్టాలను సమర్థిస్తున్న 25 రైతు సంఘాలతో కేంద్ర మంత్రి తోమర్ సమావేశమవ్వడం చర్చనీయాంశంగా మారింది.

చర్చల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను చేధించేందుకు రైతు సంఘాలు రెండు రోజుల క్రితం చర్చలకు సుముఖతను వ్యక్తం చేశాయి. చర్చల ఎజెండాను కేంద్రానికి పంపించాయి. కాగా.. రైతుల ఎజెండాలో మార్పులు సూచిస్తూ 30వ తేదీన చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. తమ ఎజెండాపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రైతులు తాము చర్చలకు వెళ్లడంలేదని తేల్చిచెప్పారు. దీంతో మరోమారు చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిని అవలంభింస్తోందని రైతు పోరాట సమన్వయ సమితి ఆరోపించింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది. హర్యానాలో టోల్‌ ప్లాజాల వద్ద పన్నుల నిరాకరణతో పాటు, కార్పొరేట్ ఉత్పత్తుల బహిష్కరణ జరుగుతోందని డిసెంబర్ 30న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది

1500 టెలికాం టవర్ల ధ్వసం

రైతుల ఆందోళన రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు రాష్ట్రంలోని 1500 టెలికాం టవర్లను ధ్వంసం చేశారు. రిలయెన్స్ జియో టెలికాం టవర్లకు విద్యుత్ నిలిపివేయడంతో పాటు, జనరేటర్లను తొలగించారు. కొన్నిచోట్ల టవర్ల పరికరాలను ధ్వంసం చేశారు. ఫైబర్ కేబుళ్లను దగ్ధం చేశారు. అంబానీ, అదానీ లాంటి కార్పోరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చిందని మొదటి నుంచీ ఆరోపిస్తున్న రైతులు అంబానీ, అదానీల ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. తాజాగా టెలికాం టవర్ల ధ్వంసంతో తమ ఆందోళనను మరో స్థాయికి చేర్చారు. కాగా… పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రైతుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలికాం సేవలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంతో రైతుల ఆందోళనను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది కేంద్రం.

కేంద్రానికి మద్దతు

వ్యవసాయ చట్టాలను సమర్థించే శక్తులను ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మరో మాటలో చెప్పాలంటే రైతులకు ఎదురుగా రైతులనే నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంతో 25 రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసిన రైతు సంఘాల నేతలు కేంద్రానికి తమ మద్దతు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఒక లేఖను అందజేశారు. ఈ సందర్భంగా రైతులకు వాస్తవాలకు అర్థం చేయించడం ద్వారా వారి మద్దతును కూడగట్టుకోగలిగామని తోమర్ వ్యాఖ్యానించడం గమనార్హం. యూపీఏ సర్కారు తీసుకురావాలనుకున్న చట్టాలనే తాము తీసుకువచ్చామని అన్నారు. వ్యవసాయ చట్టాలను ఒకటి రెండు రాష్ట్రాల రైతులే వ్యతిరేకిస్తున్నారని మొదటి నుంచీ వాదిస్తున్న కేంద్రానికి తాజా పరిణామాలు అదనపు బలం ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వ్యవసాయ చట్టాలకు మద్దతు పెరుగుతోందని నిరూపించుకునే పనిలో పడ్డ కేంద్రం అదే సమయంలో ప్రతిపక్షాలనూ డైలమాలో పడేసేందుకు సిద్ధమవుతోంది.