iDreamPost
android-app
ios-app

దేవుడన్నవాళ్లే దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు

దేవుడన్నవాళ్లే దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు

రాజకీయ రంగప్రవేశం విషయంలో రజనీకాంత్ చేతులెత్తేసినప్పటికీ అభిమానులు మాత్రం పట్టువీడడం లేదు. కొత్త సంవత్సరంలో పార్టీ ఆవిర్భావం ఉంటుందన్న రజనీకాంత్ చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేకపోతున్నానంటూ ప్రకటించారు. రజనీకాంత్ ప్రకటన అభిమానులకు తీరని నిరశను మిగిల్చింది. దీంతో రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ ఆందోళనలు చేపడుతున్నారు.

దశాబ్దాలుగా రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు స్వయంగానే ఆయనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. కానీ మాట నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. తన వల్లకాదంటూ కాడి ఎత్తేశారు. దీంతో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని రజనీకాంత్ ఇంటి ముందు ఓ అభిమాని ఆత్మహత్యకు యత్నించాడు. రాజకీయాలకు రాకూడదనే రజనీ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని కోరుతూ మురుకేసన్ అనే అభిమాని రజనీ ఇంటిముందు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన మురుకేసన్ ప్రస్థుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆధ్యాత్మిక రాజకీయాలతో ప్రజల ముందుకు వస్తానన్న రజనీకాంత్ పార్టీ పేరు, గుర్తు పై కూడా కసరత్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీ పక్కా అని అభిమానులు విశ్వసించారు. కానీ ఆఖరు నిమిషంలో ఆయన వెనకడుగు వేయడంతో తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జైకొట్టిన అభిమానులే ఇప్పుడు ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నారు. రజనీ ఇంటి ముందు వందలాది మంది అభిమానులు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

రజనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు అభిమానులు. కొన్ని చోట్ల రజనీకాంత్ దిష్టిబొమ్మలను సైతం తగులబెట్టారు. రజనీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాజకీయాల్లో రావల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి రజనీకాంత్ నిలకడలేని మనిషిగా మరోమారు నిరూపించుకున్నారు. ఇప్పుడు సొంత అభిమానుల నుంచే ఆగ్రహన్ని చవిచూస్తున్నారు.