iDreamPost
iDreamPost
గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఓటిటి ద్వారా రిలీజైన కలర్ ఫోటోతో ప్రేక్షకులకు సుపరిచితుడైన సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ఫ్యామిలీ డ్రామా సినిమా నిన్న సోనీ లివ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇళ్లకు వచ్చేసింది. ట్రైలర్ లోనే ఇందులో ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పడంతో క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు దీన్ని చూడాలని డిసైడ్ చేసుకున్నారు. అందులోనూ చూపించిన పాయింట్ ఆసక్తి రేపడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్ లో ఆపరేషన్స్ మొదలుపెట్టాక వివాహ భోజనంబు, ఆకాశవాణిలతో మంచి బోణీ కొట్టిన సోనీ లివ్ దీని మీద గట్టి నమ్మకమే పెట్టుకుంది. మరి ఆకట్టుకునేలా ఈ రెండు గంటల ఫ్యామిలీ డ్రామా మెప్పించిందో లేదో చూద్దాం.
వయసొచ్చిన కొడుకులని చూడకుండా వాళ్ళను అస్తమానం తిట్టిపోసే ఓ తండ్రి(సంజయ్ రతా). ఈయన పోరు పడలేకే రామా(సుహాస్) ఇల్లు వదిలి వెళ్ళిపోయి విచిత్ర మనస్తత్వంతో బయట తిరుగుతూ ఉంటాడు. రెండో వాడు లక్ష్మణ్(తేజ కాసారపు)ఉద్యోగం రాక ముందే పెళ్లి చేసుకుని నాన్నతో చివాట్లు తింటూ గడుపుతాడు. ముసలాయన పోరు పడలేక తల్లి సహాయంతో అతనికి పక్షవాతం వచ్చేలా చేస్తారు రామా, లక్ష్మణ్ లు. తర్వాత ఈ ఇద్దరూ దారుణంగా హత్యలు చేసే సైకో కిల్లర్లని వాళ్ళ భార్యలకు తెలుస్తుంది. దీంతో అసలు డ్రామా అక్కడ మొదలవుతుంది. హంతకులను ఇంట్లో పెట్టుకుని ముగ్గురు ఆడాళ్ళు ఏమయ్యారు అనేదే అసలు కథ.
ఇది ఒక్క మాటలో చెప్పాలంటే సుహాస్ వన్ మ్యాన్ షో. సైకోగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశాడు. ప్రధానంగా స్టోరీ మొత్తం దాదాపుగా ఒకే ఇంట్లోనే సాగినా ఆ ఫీలింగ్ బరువనిపించకుండా దర్శకుడు మెహర్ తేజ్ నడిపించిన తీరు బాగుంది. రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు తక్కువే కానీ డార్క్ కామెడీ అండ్ క్రైమ్ ని ఇష్టపడే వాళ్ళు నిరాశ చెందే అవకాశాలు దాదాపుగా లేవు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ మేకింగ్ లో క్వాలిటీ కనిపించింది. ఇతర ఆర్టిస్టులు కూడా సహజంగా ఉండటంతో కనెక్టివిటీ పెరిగింది. అజయ్ సంజయ్ సంగీతం, వెంకట్ ఛాయాగ్రహణం తోడ్పడ్డాయి. ఓవర్ ఎగ్జైట్ చేసే థ్రిల్స్ లేకపోయినా షాకింగ్ అనిపించే కొన్ని ట్విస్టులతో ఫ్యామిలీ డ్రామాని చూసేయొచ్చు. కాకపోతే ఫ్యామిలీ మొత్తంతో కలిసి కాదు. ఇదొక్కటి గుర్తుంచుకోవాలి.
Also Read : Romantic : రొమాంటిక్ సినిమా రిపోర్ట్