బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో వైరల్ అవుతున్న మరో ఫేక్ న్యూస్

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు ఒకవైపు భయాందోళనలకు గురి అవుతుంటే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రోజుకో ఫేక్ న్యూస్ లు వెల్లువెత్తుతున్నాయి.ఏవైనా కొత్త,వింతైన విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రజల మదిలో మెదిలేది బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.

ఈ కోవలోనే వైయస్సార్ కడప జిల్లా బనగానపల్లెలోని బ్రహ్మంగారి మఠంలో ఆలయ పూజారి చనిపోయారని, ఆయన చనిపోతూ కరోనా వైరస్ కు విరుగుడు చెప్పారని సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అల్లం,బెల్లం, మిరియాలను నీటితో కలిపి కషాయం చేసుకుని తాగితే కరోనా వైరస్ సోకదని వాట్సప్ గ్రూపులలో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆయన పార్థివ శరీరాన్ని సమాధి చేసే లోపు ఈ కషాయం తాగాలంటూ ఒక నిబంధనను కూడా జోడించి ప్రచారం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై బ్రహ్మంగారి మఠం ఆలయ మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి స్పందించారు. బ్రహ్మంగారి మఠంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ పూజారి మరణంపై వస్తున్న వార్తలను ఖండించారు. ఆలయంలోని పూజారి మరణించలేదని సజీవంగానే ఉన్నాడని ఈ పుకారు వార్తలు అవాస్తవాలని స్ఫష్టం చేశారు.మిరియాలు అల్లం బెల్లం కలిపిన కషాయం తాగితే కరోనాను నివారించవచ్చని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు ప్రచారం అవుతున్న వార్తలో వాస్తవం లేదని ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆలయ ప్రతినిధి ప్రజలను కోరారు. 

Also Read :చేతులు కడుక్కోనే స్థితి నుంచి అవే చేతులతో తర్పణాలు వదిలే పరిస్థితి రాకుడదు – SayNoToFakeNews

ఇలాంటి పుకార్లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ నేరం చట్టం కింద చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేస్తామని ఆలయ మేనేజర్ తెలిపారు.ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి ఆలయ ప్రతిష్టను దిగజార్చారని చూసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ,కడప ఎస్పీకి లేఖలు రాస్తున్నట్లు చెప్పారు.ఇలాంటి దుష్ప్రచారం వలన కాలజ్ఞానం యొక్క పవిత్రతకు భంగం కలగటంతో పాటు స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show comments