Idream media
Idream media
రాయలసీమలో ఫ్యాక్షన్ అంతరించిపోతున్నా.. ఇంకా అక్కడక్కడ దాని తాలుకూ ఆనవాలు కనిపిస్తూనే ఉన్నాయి. తమ పెత్తనాన్ని వదులుకునేందుకు ఇష్టపడని ఫ్యాక్షన్ నేతలు మరో దారిలో దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. భౌతిక దాడుల స్థానంలో జీవితాలను నాశనం చేస్తామనే బెదిరింపులతో తమ ప్రభవాన్ని కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో సామాన్యులు సమిధలవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం సంగపట్నంలో దంపతులు ఆత్మహత్య ఘటన ఫ్యాక్షన్ నేతల ఆగడాలకు అద్దం పడుతోంది.
సంగపట్నంకు చెందిన వైసీపీ కార్యకర్త ఇడమకంటి హుస్సేన్ రెడ్డి (38), ఆయన భార్య ఆదిలక్ష్మీ (35)లను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, ఫ్యాక్షన్ లీడర్ సంగపట్నం ఫకీర్ రెడ్డి బెందిరింపులతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరిపోసుకుని చనిపోయారు. టీడీపీ హాయంలో హుస్సేన్ రెడ్డి స్థలంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. స్థలానికి డబ్బులు ఇప్పిస్తానని చెప్పిన ఫకీర్ రెడ్డి.. ఆ తర్వాత మొహం చాటేశాడు. ఈ విషయంపై ఎన్ని సార్లు అడిగినా స్పందన లేకపోడంతో.. ఇటీవల హుస్సేన్‌రెడ్డి వాటర్‌ప్లాంట్‌ను నిలిపివేశాడు. దీనిపై ఆగ్రహించిన సంగపట్నం ఫకీర్ రెడ్డి తన అనుచరుడు బోయ రాయుడును హుస్సేన్ రెడ్డిపై గోడవకు పంపాడు. అనంతరం రాయుడు చేత కేసు పెట్టించాడు. ఈ విషయంపై పంచాయతీ చేసేందుకు.. హుస్సేన్ రెడ్డిని ఇంటికి పిలిచిన ఫకీర్ రెడ్డి అంతుచూస్తానని బెదిరించారు. వాటర్‌ప్లాంట్ స్థలం విషయం మరిచిపోవాలని, లేదంటే ఊర్లోనే ఉండరని హెచ్చరించారు. ఇంతటితో ఆగని ఫకీర్ రెడ్డి.. హుస్సేన్ కుమార్తెల కుటుంబాల్లో చిచ్చుపెట్టి వారి కాపురాలను కూలుస్తానని హెచ్చరించడంతో దంపతులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది చూసిన హుస్సేన్‌రెడ్డి తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
టీడీపీ హాయంలో సంగపట్నం చుట్టూ నాలుగు గ్రామాలపై పెత్తనం చేసిన ఫకీర్ రెడ్డి.. ప్రభుత్వం మారినా తన పెత్తనం కొనసాగాలనుకుంటున్నాడనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. బనగానపల్లె ప్రాంతంలో మిగిలిన ఏకైక ఫ్యాక్షనిస్టు సంగపట్పం ఫకీర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డికి ఫకీర్ రెడ్డి బందువు. వరుసకు బాబాయి అవుతాడు. గత ఎన్నికల్లో బనగానపల్లెలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపొందారు. అధికారం మారిన వెంటనే ఎమ్మెల్యే రామిరెడ్డి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, తనకు ప్రాణ హాని ఉందని పకీర్ రెడ్డి ఆరోపణలు చేశారు. నియోజకవర్గ స్థాయి కూడా లేని ఫకీర్ రెడ్డితో తనకు విభేదాలు ఎందుకు ఉంటాయని, పైగా ఫ్యాక్షన్ రాజకీయాలుకు తాను దూరమని ఫకీర్ రెడ్డి ఆరోపణలను రామిరెడ్డి తోసిపుచ్చారు. అయితే ఫకీర్ రెడ్డి మాత్రం తన ఫ్యాక్షన్ పంథాను మాత్రం మార్చుకోలేదు. సంగపట్నం చుట్టు పక్కల నాలుగు గ్రామాల్లో ఇంకా తన పెత్తనం కొనసాగాలనుకుంటున్నాడు. దాని ప్రభావమే హుస్సేన్‌రెడ్డి దంపతుల ఆత్మహత్య. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటితోనైనా ఫకీర్ రెడ్డి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందా..? లేదా..? వేచి చూడాలి.