iDreamPost
iDreamPost
పదో తరగతి, ఇంటర్మీడియేట్ బోర్టు పరీక్షలు నిర్వహించుకునేందుకు లాక్‌డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దేశంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన పదో తరగతి, ఇంటర్మీడియేట్ బోర్డు పరీక్షలు లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవలి లాక్‌డౌన్ 3.0 ముగిసి, లాక్‌డౌన్ 4.0 ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తుంది. బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ప్రజా రవాణాకు అనుమతిస్తూ లాక్‌డౌన్ మార్గదర్శకాలను సడలించింది. అందులో భాగంగానే పదో తరగతి, ఇంటర్మీడియేట్ బోర్టు పరీక్షలు నిర్వహించేందుకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
షరతులతో కూడిన మినహాయింపు
బోర్డు పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకునేందుకు కేంద్రం అనుమతిస్తూ తప్పని సరిగా పాటించాల్సిన అంశాలను కూడా తెలిపింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటి కొన్ని షరతులతో లాక్‌డౌన్ పరిమితుల నుండి పదవ తరగతి, పన్నెండో తరగతులకు మినహాయింపు ఇచ్చింది.
లాక్‌డౌన్ వల్ల దేశంలో పాఠశాలలన్ని మూసివేయడంతో మార్చి 25 నుండి పరీక్షలు జరగలేదు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాల్లో కూడా ఏ విద్యా సంస్థ కూడా పని చేసేందుకు అనుమతి లేదు. అయితే పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, సిబిఎస్‌ఇ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు రావడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆ లేఖలో అజయ్ భల్లా “విద్యార్థుల విద్యా ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని పదో తరగతి, పన్నెండో తరగతలకు బోర్డు పరీక్ష నిర్వహించడానికి లాక్‌డౌన్ చర్యల నుండి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాంష అని పేర్కొన్నారు.
కంటెన్మెంట్ జోనుల్లో పరీక్ష కేంద్రానికి అనుమతి లేదు
అయితే, కంటెన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రం అనుమతించబడదు.
“విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది మాస్క్ లు ధరించాల్సి ఉంటుంది. అలాగే థర్మల్ స్క్రీనింగ్ కోసం సదుపాయం ఉండాలి. ఈ కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. భౌతిక దూరాన్ని అమలు చేయాలి” అని లేఖలో పేర్కొన్నారు. “వివిధ బోర్డులచే నిర్వహించబడే పరీక్షల దృష్ట్యా, వారి పరీక్షల షెడ్యూల్ ఉండాలి” అని అన్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.