iDreamPost
android-app
ios-app

పీఛేమూడ్ అంటున్న ఏపీ బీజేపీ నేతలు, బాబు బ్యాచ్ ఖాళీ చేస్తుందనే సంకేతాలు

  • Published Jan 09, 2022 | 2:41 PM Updated Updated Mar 11, 2022 | 10:26 PM
పీఛేమూడ్ అంటున్న ఏపీ బీజేపీ నేతలు, బాబు బ్యాచ్ ఖాళీ చేస్తుందనే సంకేతాలు

ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలువురు నేతలు బీజేపీ పంచన చేరారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్ వంటి టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా కేంద్ర బీజేపీ కార్యాలయం తలుపులు తట్టారు. రామ్ మాధవ్ వంటి వారితో భేటీ కూడా జరిగింది. కానీ చివరకు మనసు మార్చుకుని మళ్లీ వెనక్కి వచ్చారు. దాంతో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అప్పట్లో సోము వీర్రాజు ప్రకటించినా ఒక్కరు గోడదాటలేదు. ఎమ్మెల్యేలెవరూ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన దాఖలాలు లేవు. కానీ నలుగురు ఎంపీలు మాత్రం టీడీపీని వీడుతూ బీజేపీ కండువా కప్పుకున్నారు. వారంతా చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు కావడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది.

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలతా మళ్లీ తమ పాత బాసు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేశారు . బీజేపీలో ఉంటూనే టీడీపీ లక్ష్యాలను నెరవేర్చే కర్తవ్యం నిర్వహించారు. పలు సందర్భాల్లో టీడీపీ వాణీ వినిపిస్తూ వచ్చారు. కొన్నిసార్లు టీడీపీనా, బీజేపీనా అనే తేడా లేకుండా అలాంటి నేతల స్వరం ఉండేది. ఇక రాయలసీమకు చెందిన కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి బైబై చెప్పి బీజేపీ గూట్లో వాలారు. వారందరి రాకతో బీజేపీ బలపడిందనే అభిప్రాయాన్ని కల్పించేందుకు కమలం నేతలు యత్నించారు. కానీ తీరా ఇప్పుడు మళ్లీ ఈ నేతలంతా తమ పాత పార్టీలోకి మారే ప్రయత్నాలు మొదలెట్టారు. త్వరలో ఒక్కొక్కరిగా చంద్రబాబు చెంతకు చేరే యత్నంలో ఉన్నారనే సంకేతాలు ఇస్తున్నారు. బీజేపీలో ఉన్న బాబు బ్యాచ్ అంతా ఆపార్టీని వీడి టీడీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

బీజేపీ, టీడీపీ బంధం మళ్లీ చిగురించాలని ఈ నేతలంతా ఆశించారు. అదే జరిగితే తాము బీజేపీలో కొనసాగుతూ బాబు నాయకత్వం బలపరచవచ్చని అంచనా వేశారు. కానీ కేంద్ర బీజేపీ నాయకులు బాబుకి ససేమీరా అంటున్నారు. మళ్లీ టీడీపీతో కలిసే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శతవిధాలా ప్రయత్నించినా తెలుగు బీజేపీ నేతల లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ఈ పరిణామాలు టీడీపీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న నేతలకు కంటగింపుగా మారింది. పైగా వారిలో కొందరి పదవీకాలం ముగుస్తున్న తరుణంలో మళ్లీ పదవిదక్కే అవకాశం కూడా లేదు.

బీజేపీలో రాజ్యసభ సీటు కోసం ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించే అవకాశం దాదాపు శూన్యం. ఈ పరిస్థితుల్లో నమ్ముకున్న పార్టీ ప్రయోజనాలు నెరవేరక, తమ పదవీ కొనసాగించే అవకాశం లేని పార్టీలో ఎందుకు కొనసాగాలనే ఆలోచనలో వారున్నట్టు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యేలలో ఇప్పటికే ధర్మవరం వరదాపురం సూరి ఈ మేరకు సంకేతాలు ఇచ్చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. యూపీ ఫలితాలు వెలువడిన తర్వాత సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కూడా బీజేపీని వీడే అవకాశాలున్నాయి. మొత్తంగా ఏపీలో బీజేపీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా వీడుతూ టీడీపీలో చేరడం ద్వారా చంద్రబాబు సారథ్యంలోని పార్టీ బలపడుతుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే యత్నం మొదలయినట్టు కనిపిస్తోంది. పదవులకు దూరంగా కూడా అనేక మంది బీజేపీలో ఉన్న నేతలు టీడీపీ వైపు తరలిపోయే సంకేతాలిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా ఈ పరిణామాలు ఏపీ బీజేపీలో కీలక పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంది.