iDreamPost
iDreamPost
అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. అంతే అనూహ్యంగా దేశ అత్యున్నత రాజకీయ పీఠం అధిరోహించారు. యువ ప్రధానిగా రికార్డ్ సృష్టించారు. ఒక టర్మ్ మాత్రమే ఆ పదవిలో ఉన్నా సంకల్ప శుద్ధితో పనిచేశారు. భారత రాజకీయాలలో పెనుమార్పులకు.. పాలనావ్యవస్థలో సంస్కరణలకు బాటలు వేశారు.
అచిరకాలంలోనే భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆ యువ నేత తల్లి ఇందిర మాదిరిగానే ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. అతనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ప్రచారంలో ఉండగా తమిళ ఉగ్రవాదుల మానవబాంబు ఆయన్ను బలిగొంది. రాజీవ్ మనకు దూరమై మూడు దశాబ్దాలు గడిచినా.. ఆయన జ్ఞాపకాలు.. చేపట్టిన సంస్కరణలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.
అతి సాధారణ జీవితం
తల్లి ఇందిరాగాంధీ భారత ప్రధానిగా, సోదరుడు సంజయ్ గాంధీ ఎంపీగా ఉన్నా రాజీవ్ మాత్రం రాజకీయాలకు చాలా దూరంగా అత్యంత సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడ్డారు. యూకేలో చదువు పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన ఆయన ప్రొఫెషనల్ పైలట్ గా ఉద్యోగంలో చేరారు. సతీమణి సోనియా, పిల్లలు రాహుల్, ప్రియాంకలతో కలిసి ఢిల్లీలోని స్లం ఏరియాలో అతి సాధారణ ఇంట్లో అద్దెకు ఉండేవారు. అప్పట్లో మధ్యతరగతి ప్రజలు వాడే లాంబ్రెటా స్కూటర్నే వాహనంగా వినియోగించేవారు. సోదరుడు సంజయ్ గాంధీ 1980లో విమాన ప్రమాదంలో మరణించడంతో అనివార్య పరిస్థితుల్లో తల్లికి చేదోడుగా ఉండేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడు ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇందిర మరణంతో..
దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఖలిస్తాన్ ఉగ్రవాదుల కుట్రతో.. ఢిల్లీలోని తన నివాసంలోనే.. అంగరక్షకుల చేతిలో 1984 అక్టోబర్ 31న హతం కావడం దేశ రాజకీయాలను కుదిపివేసింది. అప్పటికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా ఉన్న రాజీవ్ గాంధీని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అప్పటికప్పుడు తమ నాయకుడిగా ఎన్నుకోవడంతో రాజీవ్ అనుకోని రీతిలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రజాతీర్పు లేకుండా అత్యున్నత పీఠంపై కూర్చోవడం ఇష్టంలేని రాజీవ్ అదే ఏడాది డిసెంబర్లో పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో 411 సీట్ల బంపర్ మెజారిటీతో 40 ఏళ్ల చిన్న వయసులోనే అధికారం చేపట్టారు. అయితే 1989 ఎన్నికల్లో 200 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటుకు ఇష్టపడలేదు. ప్రతిపక్ష నేతగా ఉంటూనే 1991 మధ్యంతర ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు శ్రీపెరంబుదూర్ వెళ్లి మానవబాంబు దాడిలో హతమయ్యారు.
సంస్కరణలకు బీజం
అతి చిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టినా పాలనలో రాజీవ్ ఎంతో పరిణితి చూపారు. దేశంలో ఆర్థిక, సాంకేతిక, విద్యా రంగాల్లో సంస్కరణలకు పునాది వేసింది ఆయనే.
-అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పట్లో దేశంలో పాతుకుపోయిన ఆయారాం గాయారాం సంస్కృతిని అరికట్టేందుకు 1985లో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే, ఎంపీలు అధికారం, ఇతర ప్రయోజనాల కోసం పార్టీలు మారడాన్ని ఈ చట్టం నిరోధిస్తుంది.
-విడాకులు పొందే ముస్లిం మహిళల సంక్షేమం కోసం 1986లో ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం అమల్లోకి తెచ్చారు.
-దేశంలో పారిశ్రామిక ఉత్పత్తిని పెంచేందుకు సబ్సిడీలు ప్రకటించారు. దిగుమతి సుంకాలు తగ్గించారు.
– ఐటీ, టెలికాం రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ రంగంలో ఎంటీఎన్ఎల్, వీఎస్ ఎన్ ఎల్ సంస్థలు నెలకొల్పారు. సామాన్య ప్రజలకు కూడా టెలిఫోను ను అందుబాటులోకి తెచ్చేందుకు పబ్లిక్ టెలిఫోన్ బూత్ ల వ్యవస్థ ప్రారంభించారు.
-విద్యా విధానంలోనూ ఎన్నో మార్పులు చేశారు. సామాన్య పిల్లల కోసం జవహర్ నవోదయ విద్యాలయాలు రాజీవ్ హయాంలోనే ఏర్పాటు చేశారు.
Also Read : పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలు..!