iDreamPost
android-app
ios-app

గోదావరి జిల్లాలో పీఆర్‌పీ ఓటమికి ఆయనే కారణమట..!

గోదావరి జిల్లాలో పీఆర్‌పీ ఓటమికి ఆయనే కారణమట..!

కొంత మంది రాజకీయ నేతలు చేసే ప్రకటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఏదైనా పరిణామం జరిగిన సమయంలో మాట్లాడని వారు ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పరిణామం గురించి మాట్లాడడం, అది తమ వల్లే జరిగిందని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఈ కోవలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు వరసలో ఉంటారు. ఏదైనా పరిణామం జరిగితే అది తనకు అనుకూలంగా మలుచుకుని మాట్లాడడంలో చంద్రబాబు పెట్టింది పేరు. ఇప్పుడు మాజీ ఎంపీ హర్షకుమార్‌ కూడా చంద్రబాబు తరహాలోనే ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు.

2009 ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజా రాజ్యం పార్టీ (పీఆర్‌పీ) పోటీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 294 సీట్లకు గాను పీఆర్‌పీ 288 సీట్లలో పోటీ చేసి 18 చోట్ల గెలిచింది. ఇందులో నాలుగు సీట్లు తూర్పుగోదావరి జిల్లాలోనే వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కూడా పీఆర్‌పీ గెలిచింది. మొత్తం మీద పీఆర్‌పీ తూర్పులో పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్, కొత్తపేట నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అయితే పీఆర్‌పీ ఉభయగోదావరి జిల్లాల్లో తన వల్లే ఓడిపోయిందని హర్షకుమార్‌ చెప్పుకొచ్చారు.

హర్షకుమార్‌ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో వరుసగా రెండోసారి హర్షకుమార్‌ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్‌సభ నుంచి పోటీ చేశారు. 2004లో తొలిసారి అక్కడ నుంచి 41,485 ఓట్ల మెజారిటీతో గెలిచిన హర్షకుమార్‌ 2009లోనూ విజయం సాధించారు. అయితే మెజార్టీ గతం కన్నా తగ్గింది. ఈ సారి 40,005 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత హర్షకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కాకుండా.. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలో నిలిచారు. రెండు సార్లు పదేళ్లపాటు ఎంపీగా చేసిన అమలాపురం లోక్‌సభ స్థానంలో హర్షకుమార్‌కు ఈ సారి 9,931 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

ప్రజలకు ఏ మాత్రం పరిచయం లేని, రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపని బహుజన సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 7,219 ఓట్లు రావడం విశేషం. పీఆర్‌పీ ఓటమికి తానే కారణమని చెబుతున్న హర్షకుమార్‌ పదేళ్లపాటు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న లోక్‌సభ స్థానం నుంచి మూడో సారి పోటీ చేసి కనీసం డిపాజిట్‌ కూడా ఎందుకు సాధించలేకపోయారని సోషల్‌ మీడియాలో చిరంజీవి అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి వీటికి హర్షకుమార్‌ ఏం సమాధానం చెబుతారో చూడాలి.