వైసిపిలో చేరిన రామ సుబ్బారెడ్డి

  • Published - 01:03 PM, Wed - 11 March 20
వైసిపిలో చేరిన రామ సుబ్బారెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్‌ కడప జిల్లాలో ఈ రోజు ప్రతిపక్ష పార్టీకి మరో షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, దివంగత నేత బాంబుల శివారెడ్డి కుమారుడు గిరిధర్ రెడ్డి తో పాటు తన అనుచరులతో కలసి బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

Also Read :నేడు వైఎస్సార్‌సీపీలో చేరుతోన్న కడప సీనియర్‌ టీడీపీ నేతలు

అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడిన రామసుబ్బారెడ్డి అత్యంత ప్రజాధరణతో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఆకర్షితులైన తాము ఎటువంటి పదవి ఆశించకుండా స్వచ్ఛందంగా వైసిపిలో చేరినట్టు తెలిపారు. గత 45 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న తమ కుటుంబం తరుపున గతంలో రెండు సార్లు మంత్రిగా, టిడిపి జిల్లా అధ్యక్షుడిగా చేసినప్పటికీ.. ఇటీవలకాలంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని ప్రజలు దారుణంగా తిరస్కరించడం, జగన్ మోహన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించడంతో ప్రజాభీష్టానికి తగ్గట్టే తాము కూడా ప్రజాభిప్రాయాన్ని, ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తూ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి స్వచ్చందంగా ముందుకొచ్చామన్నారు.

ఇదే సమయంలో కష్టకాలంలో జమ్ములమడుగులో వైసిపిని నిలబెట్టిన స్థానిక వైసిపి ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి తో కలసి పనిచేసేందుకు తమకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు తమ కుటుంబం వెంట ఉండి కష్టకాలంలో తమకు అండగా నిలబడిన కార్యకర్తలందరికీ రామసుబ్బారెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేశారు.

Show comments