iDreamPost
android-app
ios-app

పేర్ని నానిపై హత్యాయత్నం కేసు: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

  • Published Dec 04, 2020 | 6:06 AM Updated Updated Dec 04, 2020 | 6:06 AM
పేర్ని నానిపై హత్యాయత్నం కేసు: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

బందరులో హత్యా రాజకీయాలకు తెరలేపిన నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడి హత్య జరిగింది. అందులో మాజీ మంత్రి కొల్లి రవీంద్ర నిందితుడిగా ఉన్నారు. జైలుకి కూడా వెళ్లారు. బెయిల్ పై ప్రస్తుతం బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పేర్ని నాని మీద హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. అది కూడా టీడీపీ కి చెందిన కార్యకర్త ఈ నేరానికి పాల్పడడం అందరినీ కలచివేస్తోంది.

టీడీపీ జిల్లా ఉపాధ్యాక్షురాలు ఉమాదేవికి స్వయంగా సోదరుడిగా ఉన్న వ్యక్తి మంత్రిపై హత్యాయత్నానికి పూనుకోవడం అందరినీ అనుమానాలకు గురిచేస్తోంది. ఈ ఘటన కూడా ఏకంగా మంత్రి తన తల్లి చనిపోయిన తర్వాత దశదిన కర్మలో ఉండగా జరగడం మరింత విస్మయకరంగా మారింది. దాంతో ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. స్వయంగా హోం మంత్రి సుచరిత , డీజీపీ గౌతమ్ సవాంగ్ నేరుగా మచిలీపట్నం వెళ్లారు. ఘటన జరిగిన నాడే మాజీ మంత్రి పేర్ని నానిని కలిసి వివరాలు సేకరించారు..

ఆ తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ప్రధానంగా కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించిన తరుణంలో పలువురు టీడీపీ నేతల పాత్ర పట్ల సందేహాలు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే అనుమానం ఉన్న వారందరినీ విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు నోటీసు లిచ్చి విచారణ నిర్వహించారు. అయితే శుక్రవారం నాడు విచారణకు రావాలని మాజీ మంత్రి కొల్లి రవీంద్రకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన తీరు పట్ల సందేహంతో నేరుగా ఆయన ఇంటికి చేరుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

కొల్లి రవీంద్ర ఇంటికి వెళ్లిన సీఐ శ్రీనివాస్ నేరుగా ఆయన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మంత్రిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఆయన్ని విచారించేందుకు పూనుకున్నారు. దాంతో ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది పోలీసుల విచారణలో తేలబోతోంది. ఇది రాజకీయంగా వేడెక్కించే అవకాశం కనిపిస్తోంది . కానీ ప్రశాంతంగా ఉండే బందరులో ఇలాంటి వ్యవహారాలకు తెరలేపిన వారిని మాత్రం కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ప్రజల్లో వినిపిస్తోంది.