Idream media
Idream media
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షం తన గళం విప్పాలి. అధికార పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలు చేయాలని నిలదీయాలి. నిత్యం సద్విమర్శలు చేస్తూ పాలకపక్షాన్ని సరైన దిశలో నడిపేందుకు ప్రతిపక్ష తన వంతు పాత్ర పోషించాలి. అప్పుడే ప్రజాధారణ పొందగలుగుతారు. అధికారం చేపట్టేందకు మార్గం సుగమం అవుతుంది. ఇది ఎన్నో మార్లు రుజువైంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వర్తించిన బాధ్యత వల్ల 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
చరిత్ర స్పష్టంగా కనిపిస్తున్నా.. ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం పాలకపక్షంపై వాస్తవవిరుద్ధమైన ఆరోపణలు, చౌకబారు విమర్శలు చేస్తూనే ఉంది. ప్రజా సమస్యలపై పోరాటం, వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై నిలదీత పక్కనపెట్టిన టీడీపీ.. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని ఉద్యమం చేస్తోంది. మరో వైపు అధికార పార్టీ, పాలకులపై హాస్యాస్పదమైన విమర్శలు చేస్తూ ప్రజల్లో ఇంకా పలుచనవుతోంది.
తాజాగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికార పార్టీపై చేసిన విమర్శలు చౌకబారు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిన్న విశాఖ జీవీఎంసీ వద్ద ఇంటి పన్నులు తగ్గించాలని చేసిన నిరసన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో అడ్డపంచెలోళ్లు దిగారు. విశాఖలో దౌర్జన్యాలు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి విశాఖలో రుబాబు చేస్తున్నారు.. అంటూ విమర్శలు గుప్పించారు.
అడ్డపంచెలోళ్లు విశాఖలో దిగారంటూ అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శలు కొత్తవి కాదని విశాఖలో 2014 ఎన్నికలను పరిశీలించిన వారికి సుపరిచితం. 2014 ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ నుంచి వైసీపీ తరఫు వైఎస్‌విజయమ్మ పోటీ చేశారు. టీడీపీ–బీజేపీ కూటమి తరఫున కంభంపాటి హరిబాబు పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల ప్రచారంలో టీడీపీ, బీజేపీ నేతలు.. వైసీపీ గెలిస్తే విశాఖలో భూ ఆక్రమణలు పెరిగిపోతాయని, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడ పెత్తనం చేస్తారని విమర్శలు గుప్పించారు. విమర్శలే కాదు.. జూనియర్ ఆర్టిస్టులకు అడ్డపంచెలు కట్టి వారు కడప నుంచి విశాఖ వస్తున్నట్లు చిత్రీకరించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో దిగిన అడ్డపంచెల సినీ జూనియర్ ఆర్టిస్టులు ఎన్నికల సమయంలో విశాఖ వీధుల్లో హల్‌చల్ చేశారు. ఇది చూసిన జనం.. వైసీపీ గెలిస్తే.. నిజంగా టీడీపీ వాళ్లు చెప్పేది జరగొచ్చనే భావనలో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఫలించింది. వైసీపీ ఓడిపోయింది. ఆ తర్వాత విశాఖలో టీడీపీ హాయంలో భూ కబ్జాలు జరిగాయి. దానిపై ప్రస్తుతం సిట్ విచారణ జరుపుతోంది. విషయం అర్థం అయిన విశాఖ ప్రజలు గడచిన ఎన్నికల్లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు.
అయినా చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రం ఇంకా పాత చింతకాయ పచ్చడి రాజకీయాలే చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఉపయోగించిన అడ్డపంచెల వ్యూహాన్ని మళ్లీ ఇప్పుడు అమలు చేయాలని ప్రత్నిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అధికార పార్టీ ఏమైనా ఆక్రమణలకు, అవినీతి, కుంభకోణాలకు పాల్పడితే.. వాటిని బయటపెడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది టీడీపీకి లాభిస్తుంది. అంతేకానీ.. అరిగిపోయిన గ్రామ్ రికార్డు మాదిరిగా.. జగన్ లక్ష కోట్లు తిన్నారు.. విశాఖలో అడ్డపంచెలోళ్లు దిగారు.. అంటూ విమర్శలు చేయడం వల్ల టిడిపికి వచ్చే లాభం కన్నా.. నష్టమే ఎక్కువన్నది గత ఎన్నికల్లోనే రుజువైంది.