iDreamPost
android-app
ios-app

భూమా అఖిలప్రియ అరెస్ట్‌

భూమా అఖిలప్రియ అరెస్ట్‌

కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీప బంధువు, బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, ఆయన సోదరులు మంగళవారం కిడ్నాప్‌ అయ్యారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌ నివాసానికి వచ్చిన గుర్తుతెలియన వ్యక్తులు తాము ఐటీ అధికారులమంటూ తమ వెంట తీసుకెళ్లారు. ఇంట్లోని ల్యాప్‌ ట్యాప్లు, మొబైల్‌ ఫోన్లను కూడా వారి వెంట తీసుకెళ్లారు.

కిడ్నాపర్లు వారిని హైదరాబాద్‌ శివార్లలోని ఓ ఫాం హౌస్‌కు తీసుకెళ్లారు. తెల్ల పేపర్లపై సంతకాలు తీసుకుని ముగ్గురిని నార్సింగి వద్ద వదలిపెట్టి పరారయ్యారు. ఇంటికి చేరుకున్నవెంటనే ప్రవీణ్‌ సోదరుడు ప్రతాప్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితులను పట్టుకున్న పోలీసులు, బాధితుల వద్ద తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ కిడ్నాప్‌ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నదీ తేల్చినట్లు సమాచారం.

నిందితులు ఇచ్చిన సమాచారంతోనే మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భూ లావాదేవీలకు సంబంధించే కిడ్నాప్‌ వ్యవహారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై మాట్లాడిన ప్రవీణ్‌ సోదరుడు ప్రతాప్‌ రావు.. దీని వెనుక ఎవరున్నదీ తమకు తెలుసని వ్యాఖ్యానించారు. భూ వివాధానికి సంబంధించి చట్ట ప్రకారం వెళ్లకుండా దౌర్జన్యంగా తమను ఫాం హౌస్‌కు తీసుకెళ్లారని చెప్పారు. తమ తగాదాలను రాజకీయం చేద్దని, దీనితో సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రతాప్‌ రావు పేర్కొన్నారు. తమను కిడ్నాప్‌ చేసిన వారిపై ఎలాంటి కోపం లేదని.. మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటామని ఆయన చెప్పడం విశేషం. అయితే పోలీసులు మాత్రం తమ పని తాము చేశారు.