iDreamPost
android-app
ios-app

మంత్రిని టార్గెట్‌ చేసిన మాజీ మంత్రి

మంత్రిని టార్గెట్‌ చేసిన మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చిత్రవిచిత్రంగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కనీసం పరిచయం లేని రెండు రాజకీయ పార్టీల నేతల మధ్య ప్రస్తుతం వార్‌ జరుగుతోంది. ఒకే జిల్లానో లేదా పక్క జిల్లా కూడా కానీ నేతను మాజీ మంత్రి టార్గెట్‌ చేయడం ప్రస్తుత చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లాకు చెందిన కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ మాజీ మంత్రి, విశాఖపట్నం టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు తరచూ అవినీతి ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడైన కార్తిన్‌కు కేసు నుంచి తప్పించేందుకు జయరాం అతని నుంచి విలువైన కారు లంచంగా తీసుకున్నారని ఆరోపించారు. కార్తిక్‌ నుంచి కారును మంత్రి జయరాం తనయుడు తీసుకున్నారని కొన్ని ఫోటోలను విడుదల చేశారు. నాలుగైదు రోజులు ఈ విషయంపై అయ్యన్న పాత్రుడు విమర్శలు చేశారు. మీడియాలో హల్‌చల్‌ చేశారు. టీడీపీ అనుకూల మీడియా కూడా అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు మరో అంశంపై గుమ్మనూరును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు.

కర్నూలులో మంత్రి జయరాం బెదిరించి భూములు లాక్కున్నారని తాజాగా అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. బాధితులను భయపెట్టి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారని విమర్శిస్తున్నారు. 400 ఎకరాలు కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ప్లాన్‌ చేశారని ఆరోపిస్తున్నారు. ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ పరిధిలోకి రాకుండా 204 ఎకరాలను పలువురి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని అయ్యన్న పాత్రుడు మంత్రి గుమ్మనూరుపై ఆరోపణలు సంధిస్తున్నారు. అయ్యన్న పాత్రుడు చేసే ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా.. విశాఖపట్నంలో ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎక్కడో కర్నూలులో ఉండే మంత్రి గుమ్మనూరు జయరాంను ఎందుకు టార్గెట్‌ చేశారన్న దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.