iDreamPost
android-app
ios-app

అంతుచిక్కని వ్యాధిలో.. అదొక్కటే ఉపసమనం

అంతుచిక్కని వ్యాధిలో.. అదొక్కటే ఉపసమనం

ఏలూరులో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధి తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగిస్తూ.. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ వ్యాధిపై ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు ఇచ్చిన నివేదకతో ప్రభుత్వంతోపాటు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. నీటి శాంపిల్స్, బాధితుల రక్త నమూలనాలు సాధారణంగానే ఉన్నాయని తెలిపిన కలెక్టర్‌.. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించలేదని తెలిపారు. కల్చర్‌ రిపోర్ట్‌ రావాల్సి ఉందన్నారు. ఆ రిపోర్ట్‌ వస్తే గానీ ఈ వ్యాధి ఏమిటో, ఎందుకు వస్తుందో తెలిసే అవకాశం ఉంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించలేదని కలెక్టర్‌ చెప్పడమే ఇప్పటి వరకూ ఈ వ్యవహారంలో ఉపసమనం కలిగించే అంశం.

గత ఏడాది మార్చిలో దేశానికి వచ్చిన కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ వైరస్‌ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తుండడంతో అడ్డుకట్టవేయడం ప్రభుత్వాలకు సాధ్యం కావడంలేదు. ఏపీలోనే దాదాపు 9 లక్షల మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. దాదాపు ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో వెలుగుచూసిన ఈ వైరస్‌ ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ప్రపంచం అంతా వ్యాపించింది. ధనిక, పేద తేడా లేకుండా అన్ని దేశాలు ఈ వైరస్‌ ధాటికి విలవిలలాడుతున్నాయి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. జన జీవనం అస్తవ్యస్తమైంది.

ఓ పక్క కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధి ఏమిటన్న ఆందోళన ప్రభుత్వాలతోపాటు ప్రజల్లోనూ నెలకొంది. కరోనా వైరస్‌కు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ అంతుచిక్కని వ్యాధి కూడా విజృంభిస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందనే భయం అందరిలోనూ ఉంది. కరోనా వైరస్‌కు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో ఔషధాలు రాలేదు. వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఏలూరులో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధి.. అంటువ్యాధి కాదని కలెక్టర్‌ చెప్పడం అందరికీ ఎంతో ఉపసమనం కలిగించింది.

Read Also : ఏలూరు ఘటనపై కలెక్టర్‌ నివేదిక