Idream media
Idream media
గత చంద్రబాబు ప్రభుత్వం డిస్కమ్‌ల మీద మోపిన అప్పులు.. అవసరం లేకపోయినా అధిక ధరలకు ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల పెరిగిన రుణాల వల్ల ఏపీ విద్యుత్ వ్యవస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదలు, మధ్య తరగతి ప్రజలకు బిల్లుల భారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇవన్నీ తెలిసి కూడా ఏపీలో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. వాస్తవాలను దాచి తమ పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా విద్యుత్ షాక్ అంటూ కథనాలు వండివార్చుతున్నాయి.
దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే.. అందులో 21 రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే విద్యుత్ చార్జీలు తక్కువగా ఉన్నాయి. సాధారణంగా జలవిద్యుత్ ఉత్పత్తి ఖర్చు తక్కువ. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ.. అక్కడ భారీగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో యూనిట్ ఏకంగా రూ.5.50 వసూలు చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ ఏకంగా యూనిట్ ధర 8.33 ఉంది. జలవిద్యుత్‌కు అవకాశాలు తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ ధర కేవలం రూ. 1.45 మాత్రమే కావడం గమనార్హం. ఇది 50 యూనిట్ల వరకు వర్తిస్తుంది. ఆ తర్వాత వినియోగాన్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఏపీలో ఉన్న 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారుల్లో.. నెలకు 200 యూనిట్లు వాడే వారి సంఖ్య 1.29 కోట్లు. వీళ్లకు కనిష్టంగా యూనిట్‌కు 1.45, గరిష్టంగా 3.60 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఏపీలో ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10వేల కోట్ల సబ్సిడీ ఇచ్చింది. అలాగే గృహ విద్యుత్ సబ్సిడీ కింద 1,700 కోట్లు ఇచ్చింది. దాదాపు 21 రాష్ట్రాల్లో కనిష్టంగా రూ. 2.65 నుంచి గరిష్టంగా రూ. 8.33 వరకు చార్జ్ చేస్తున్నారు.
పేదలపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యుత్ టారిఫ్‌లను పరిశీలించిన తర్వాతే కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేరటీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి చెబుతున్నారు.