iDreamPost
android-app
ios-app

పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ: జయలలితతో చంద్రబాబు పోలికలో ఏమైనా అర్థముందా..?

  • Published Apr 03, 2021 | 12:56 PM Updated Updated Apr 03, 2021 | 12:56 PM
పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ: జయలలితతో చంద్రబాబు పోలికలో ఏమైనా అర్థముందా..?

దేశంలో అనేక సందర్భాల్లో విపక్షాలు ఎన్నికలు బహిష్కరించిన అనుభవాలున్నాయి. అయితే దక్షిణాదిన అది చాలా నామమాత్రం. కేవలం తమిళనాడులో తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్నికలు బహిష్కరించిన ప్రధాన పార్టీలు లేవనే చెప్పాలి. 1960,70 దశకాల్లో జాతీయ రాజకీయాల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్న చరిత్ర కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కేవలం తమిళనాడులో మాత్రమే జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే వరుసగా స్థానిక ఎన్నికలను బహిష్కరించిన అనుభవం ఉంది.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ నేతలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో నోటిఫికేషన్ మారిస్తే ఎన్నికల్లో పాల్గొంటామని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. కేవలం ఎన్నికల నోటిఫికేషన్ మార్చలేదనే కారణంతో ఎన్నికలు బహిష్కరించాలనుకుంటే ఇప్పటికే ముగిసిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్లు కూడా మార్చలేదనే సంగతి మరచిపోకూడదు. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలనే యధావిధిగా నిర్వహించినప్పటికీ టీడీపీ వాటిలో పాలుపంచుకుంది. అంటే ఎన్నికలకు టీడీపీ దూరం కావడానికి నోటిఫికేషన్ కారణం కాదని దీనిని బట్టి అర్థమవుతోంది.

ఇక ఎన్నికలను బహిష్కరించడం అంటే వాటికి పూర్తిగా దూరంగా ఉండడం. గతంలో కొన్ని నక్సల్ గ్రూపులు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఇలాంటి వైఖరి తీసుకుంటాయి. వాటిని తప్పుబట్టే చంద్రబాబు మాత్రం ఇప్పుడు తాను ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ వాస్తవానికి ఇప్పటికే టీడీపీ పరిషత్ ఎన్నికల బరిలో కూడా ఉంది. అభ్యర్థులకు ఆపార్టీ బీఫారం అందించింది. అభ్యర్థుల జాబితా ఖరారయ్యింది. కేవలం పోలింగ్, కౌంటింగ్ మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నాయి. దాంతో టీడీపీ పోటీలో నిలవడం లేదన్నది హాస్యాస్పదం. పైగా చంద్రబాబు ప్రకటనకు భిన్నంగా తాము పోటీలో నిలుస్తున్నట్టు అనేక మంది నేతలు చెబుతున్నారు. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు సహా పలువురు ఆ బాటలో సాగుతున్నారు. దాంతో టీడీపీ ఎన్నికలను బహిష్కరించడం అనేది అర్థరహితంగా కనిపిస్తోంది. టీడీపీ నిజంగా ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంటే మొత్తం ప్రక్రియకు దూరంగా ఉండాలి.

Also Read : నాడు టిడిపి – బీజేపీ ప్రభుత్వం సాగనంపింది.. నేడు వైసీపీ ప్రభుత్వం స్వాగతించింది..

ప్రస్తుతం చంద్రబాబు ప్రస్తావించినట్టు జయలలిత అదే పని చేశారు. నాటి కరుణానిధి ప్రభుత్వ తీరు మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలకు పూర్తిగా దూరమయ్యారు. కానీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థులు అనేక చోట్ల బరిలో ఉన్న సమయంలో ఆపార్టీ అధినేత తాము బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించడం విస్మయకరంగా మారింది. పోటీలో ఉన్న వారు విత్ డ్రా అవుతారని చంద్రబాబు చెప్పినా అనేక చోట్ల కిందస్థాయి నేతలు ససేమీరా అంటున్నారు. దాంతో చంద్రబాబు బాయ్ కాట్ కాదు కదా కనీసం మధ్యలో కాడి వదిలేసి పోదామన్నా పార్టీ శ్రేణులు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నాయి. ఇది టీడీపీలో గందరగోళ స్థితికి, అధినేత అసందర్భ నిర్ణయాలకు నిదర్శనంగా అనేక మంది అభివర్ణిస్తున్నారు.

ఏపీలోనూ వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అధికార పార్టీ నిరంకుస వైఖరికి నిరసనగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబును దూషించారంటూ రోజాపై ఏడాది పాటు బహిష్కరించారు. ఆమె కోర్టులకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నా.. స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు అనుమతించలేదు. పదే పదే వైఎస్‌ జగన్‌ మైక్‌ కట్‌ చేశారు.

ప్రజల వాణిని వినిపించే అవకాశం ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడంలేదంటూ.. ప్రజల్లోనూ తేల్చుకుంటామని సీఎం వైఎస్‌జగన్‌ ప్రజల్లోకి వచ్చారు. ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహించి.. బాబు ఇచ్చిన హామీల అమలుపై నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలలను, అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. ప్రజల మన్ననలను పొందారు. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. మరి పరిషత్‌ ఎన్నికలను మధ్యలో వదిలేసి.. బహిష్కరించామని చెబుతున్న చంద్రబాబు.. ప్రజల్లోకి రాగలరా..? ప్రజలను మెప్పించగలరా..?

ఎన్నికల బహిష్కరణ విషయంలో చంద్రబాబు తనను తాను జయలలితతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న జయలలిత.. అధికార పార్టీ నిరంకుసత్వాన్ని నిరసిస్తూ స్థానిక ఎన్నికలను, ఉప ఎన్నికలను బహిష్కరించారు. ప్రజల్లోకి వెళ్లారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. కానీ బాబు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. పరిషత్‌ ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. ప్రచారం, పోలింగ్‌ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో.. కుంటిసాకులు చెబుతూ బహిష్కరిస్తున్నామని జయలలిత, జ్యోతిబసులతో తనను తాను పోల్చుకోవడంలో ఏమైనా అర్థముందా..?

Also Read : పరిషత్ ఎన్నికల బహిష్కరణ పై బాబు చెప్పిన కారణాలు ..