బీజేపీలో హుషారు.. టీడీపీ బేజారు..

బిహార్‌ శాసన సభ ఎన్నికలతోపాటు దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టడంతో ఆ పార్టీ నేతలు హుషారుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ సీటును బీజేపీ కైవసం చేసుకోవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా వైరస్‌ వల్ల టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి సుజాతను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినా ఫలితం లేకపోయింది. సాధారణంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోతే సానుభూతి ఉంటుంది. అది కూడా ఇక్కడ పని చేయకపోవడం విశేషం.

టీఆర్‌ఎస్‌కు దుబ్బాక కంచుకోట లాంటి నియోజకవర్గం. 2009 మినహా 2004, 2008 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇక్కడ విజయదుందుభి మోగించింది. ఇలాంటి చోట, టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు, ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం బీజేపీ శ్రేణులకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జోష్‌ నింపింది.

తాజాగా వచ్చిన విజయాలతో బీజేపీ స్థానిక నేతలు తెలుగు రాష్ట్రాలో సత్తా చాటుతామని ప్రకటనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ టపాసులు పేల్చుతామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యనించడంతో టీడీపీ నేతల్లో ఇప్పటికే ఉన్న ఆందోళన కాస్త రెట్టింపైంది.

తెలుగు రాష్ట్రాలలో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన బీజేపీ.. ఏపీ కన్నా తెలంగాణలో ముందుంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మూడు ఎంపీలు సీట్లు గెలిచి ఆందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత ఆ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేతలు బీజేపీ బాట పట్టారు. దుబ్బాక ఫలితంతో ఈ వలసలు మళ్లీ జోరందుకునేలా పరిస్థితులు మారాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి బీజేపీ వైపు చూస్తున్నట్లు బలమైన ప్రచారం సాగుతోంది.

తెలంగాణలో ట్రాక్‌లో పడిన బీజేపీ.. ఇక ఏపీపై దృష్టి సారించింది. ఇందుకు తగినట్లుగానే పార్టీ అధ్యక్షుడుగా సోము వీర్రాజును నియమించింది. రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సోము.. తెలుగుబీజేపీ నేతలకు చెక్‌ పెట్టారు. ఆ తర్వాత కాలికి బలపకం కట్టుకుని తిరుగుతూ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయన పిలుపుకు టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాబూరావు బీజేపీలో చేరారు. క్షేత్రస్థాయిలో ద్వితియ శ్రేణి టీడీపీ నేతలు కూడా కమలం బాట పడుతున్నారు.

ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని, దాన్ని తాము భర్తీ చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. దానికి తగినట్లుగానే రాజకీయాలు చేస్తుండడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. వైసీపీ అధికారంలో ఉండడం, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ రాజకీయ భవిష్యత్‌ ప్రారంభంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు తమ భవిష్యత్‌పై ధీమాగా ఉన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఘోర పరాజయం, ఆ పార్టీ అధినేత జీవిత చరమాంకంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు తమ భవిష్యత్‌పై సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి దగ్గర కాగా, మరి కొంత మంది పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. ఇలాంటి నేతలపైనే బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలతో టీడీపీలో సైలెంట్‌ గా ఉన్న నేతలు బీజేపీ వైపు చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Show comments