iDreamPost
android-app
ios-app

Eenadu : సోషల్ మెసేజ్ తో సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ – Nostalgia

  • Published Oct 20, 2021 | 11:12 AM Updated Updated Oct 20, 2021 | 11:12 AM
Eenadu : సోషల్ మెసేజ్ తో సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ – Nostalgia

మనకు ఈనాడు అనగానే రామోజీరావు గారి దినపత్రిక గుర్తొస్తుంది కానీ సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. దాని విశేషాలు చూద్దాం. 100వ సినిమాగా అల్లూరి సీతారామరాజు నిర్మించిన కృష్ణకు అది సాధించిన విజయం చరిత్రలో గొప్ప స్థానాన్ని శాశ్వతంగా ఇచ్చింది. 200వ చిత్రం కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో తన కలల ప్రాజెక్ట్ అయిన ఛత్రపతి శివాజీ స్క్రిప్ట్ పనులు చేయించడం మొదలుపెట్టారు. అయితే 199వ సినిమా నిర్మాణంలో ఉండగా అనుకున్న స్థాయిలో శివాజీ సిద్ధం కాలేదు. దాంతో ఆలస్యం చేసే వీలు లేక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. సరిగ్గా అప్పుడే మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈనాడ్ నచ్చి వెంటనే హక్కులు కొనేశారు. నిజానికిది ఆయన చేయాలనుకోలేదు. ఒరిజినల్ వెర్షన్ లో హీరో వృద్ధుడు.

రీమేక్ కు తగ్గట్టు మార్పులు చేయమని పరుచూరి బ్రదర్స్ కి కృష్ణ బాధ్యతలు అప్పగించారు. మీరే హీరోగా చేయాలని ఇమేజ్ కి తగ్గట్టు కీలకమైన మార్పులు చేసి సిద్ధం చేస్తామని ఒప్పించారు. అన్నమాట ప్రకారం ఊహించిన దాని కన్నా గొప్పగా ఈనాడు రీమేక్ వెర్షన్ రాసుకుని వినిపించారు. అంతే ఇదే డబుల్ సెంచరీ మూవీ కావాలని కృష్ణ డిసైడ్ అయ్యారు. పి సాంబశివరావు దర్శకుడిగా ఎంపికయ్యారు. రాధికా హీరోయిన్ కాగా చంద్రమోహన్, జగ్గయ్య. రావు గోపాల్ రావు, శ్రీధర్, గుమ్మడి, కాంతారావు తదితరులు ఇతర తారాగణం. జెవి రాఘవులు మంచి బాణీలు సిద్ధం చేశారు. రీ రికార్డింగ్ సరిగా రాకపోవడంతో కృష్ణ రాజీ పడకుండా అదనపు వ్యయం అవుతున్నా మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కంపోజ్ చేయించడం అప్పటి మీడియాలో హై లైట్ గా చెప్పుకునేవారు.

రాజకీయ నేపథ్యంలో సమాజంలో మార్పు వచ్చి బడుగు వర్గాలు ఎదగాలని తపించి పోతూ చైతన్యం కోసం పోరాడే యువకుడి పాత్రలో కృష్ణ గారు చెలరేగిపోయారు. భారీ ఎత్తున సైకిళ్ళతో కృష్ణతో పాటు పదుల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో తీసిన రండి కదలి రండి పాట ఒక సెన్సేషన్. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం పాట అప్పటి యువతలో ఆలోచనలు రేకెత్తించింది. మసాలా కమర్షియల్ ఫార్ములాకి దూరంగా సామాజిక అంశాలను స్పృశించిన ఈనాడుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు 1982 డిసెంబర్ 12 ఈనాడు రిలీజయింది. కేవలం అయిదు రోజుల గ్యాప్ తో వచ్చిన కృష్ణంరాజు త్రిశూలం కూడా ఇదే స్థాయిలో సక్సెస్ కావడం విశేషం

Also Read : Ranam : సోలో హీరోగా గోపిచంద్ హ్యాట్రిక్ – Nostalgia