iDreamPost
iDreamPost
రామోజీరావు మార్కు జర్నలిజం అంటేనే అందులో కొంత తన రాజకీయ, సామాజిక, ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు లేకుండా ఒక్క వార్త కూడా రాయరు. అలాగే వార్తల అల్లికలో కూడా రామోజీరావు సామాజిక, ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి. ఒక అబద్దాన్ని నిజం అని నమ్మించడానికి 99 నిజాలు దాని చుట్టూ అల్లి ఆ ఒక్క అబద్దాన్ని నిజం చేస్తారు. అలాగే తన ప్రయోజనాలకు వ్యతిరేకం అనుకునే ఏ వార్తనూ ఆయన తన మీడియాలో కనిపించనివ్వరు. ఒకవేళ అలాంటి వార్తలు ఇవ్వాల్సి వస్తే వాటిని తన ప్రయోజనాలకు అనుకూలంగానే వండి వార్చుతారు.
ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే రామోజీరావు మార్కు రాజకీయ జర్నలిజం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. మూడు రాజధానులకు అనుకూలంగా నిన్న తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరమ్ ఒక భారీ ప్రదర్శన నిర్వహించింది. అమరావతి ఉద్యమాన్ని రెండు భుజాలమీద వేసుకుని గత 700ల రోజులుగా మోస్తున్న రామోజీరావు తన మీడియాలో ఈ మూడు రాజధానుల ప్రదర్శనకు సంబంధించిన వార్త ప్రచురిస్తుంది అని ఆశించలేం. ఒకవేళ ఆయన తన రాజకీయ, ఆర్ధిక, సామాజిక ప్రయోజనాలు కాస్త పక్కనపెట్టి ఏదో ఒక మూలన చిన్న వార్త ప్రచురిస్తారు అనుకున్నా అలాంటి వార్త ఎక్కడా లేదు. అయితే తన ప్రయోజనాలకు అనుగుణంగా ఆ భారీ ప్రదర్శన నుండి ఒక కొసరు వార్త వెతికి దాన్ని పత్రికలో ప్రచురించారు. మూడు రాజధానుల ప్రదర్శనలో ఎవరో ఒకరిద్దరు “జై అమరావతి” అని నినాదాలు ఇచ్చారని ఓ కొసరు వార్త ప్రచురించారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.
Also Read : మూడు రాజధానుల ఆకాంక్ష.. భారీ ర్యాలీతో బలంగా చాటిన తిరుపతి
మొత్తం ప్రదర్శన అంతా వదిలేసి ఎక్కడో ఒక మూలన ఎవరో ఒకరు నినాదాలు చేయడం, ఆ నినాదాలు ఈనాడు విలేఖరికి వినిపించడం ఆశ్చర్యంగానే ఉంది. ఓ ఐదారు వేల మంది ప్రదర్శన చేస్తుంటే ఎక్కడో ఓ మూలన జై అమరావతి అనే నినాదం ఇచ్చే ఒకరిద్దరి వద్ద ఈనాడు విలేఖరి ఎలా ఉన్నారు? ఆయనే అమరావతి అనుకూలురైన వ్యక్తులను ఆ ప్రదర్శనలోకి చొప్పించి నినాదాలు ఇప్పించారా? లేక తిరుపతిలో మకాం వేసి ఉన్న అమరావతి కార్యకర్తలు తమకు అనుకూల మీడియా ప్రతినిధులకు ముందుగానే సమాచారం ఇచ్చి వారిని పిలిపించుకుని వారి సమక్షంలోనే నినాదాలు ఇచ్చారా?
అయినా అమరావతి కార్యకర్తలకు స్వాగతం చెపుతూ మూడురాజధానులకు అనుకూలురైన కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన దృశ్యాలు ఏవీ ఈనాడుకు కనిపించలేదు. ఒకవేళ ఈ రోజు అమరావతి కార్యకర్తలు నిర్వహిస్తున్న సభలో మూడు రాజధానులు మద్దతిచ్చే కార్యకర్తలు నినాదాలు చేస్తే రేపు రామోజీరావు ఆ వార్తను కూడా రాయిస్తారా? లేక అమరావతి సభలో ప్రత్యర్ధులు చొరబడ్డారు, విధ్వంసం సృష్టించేందుకు వచ్చారు, రౌడీ మూకలు చొరబడ్డాయి అని రాయిస్తారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఎవరైనా ఒకరిద్దరు మూడురాజధానులకు అనుకూలంగా నినాదాలు చేస్తే రామోజీరావు ఎలాంటి వార్త రాయిస్తారు? అసలు చంద్రబాబు నాయుడు తన సభలో అలాంటి నినాదాలు ఇవ్వడాన్ని అంగీకరిస్తారా? రాయలసీమ రౌడీ మూకలు చొరబడ్డాయి అంటూ ధ్వజమెత్తరా?
Also Read : అమరావతి పరిరక్షణ సమితి కోట్ల లెక్కలు బయటపెట్టిన మహా వంశీ…
ఈరోజు అమరావతి సభ ఎలా జరిగినా రామోజీరావు మాత్రం టిడిపి, అమరావతి అనుకూల వార్తలే రాయడానికి, తద్వారా అమరావతి రియల్ ఎస్టేట్ రైతులకు, టీడీపీ రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండేందుకే తన శక్తి యుక్తులన్నీ వాడుతున్నారు. ఈ వయసులో కూడా ఆయన నిస్సిగ్గుగా జర్నలిజం విలువలను వదిలేసి తన టిడిపి అవసరాలకు తన మీడియాను పూర్తిగా వినియోగిస్తున్నారు. వృద్దాప్యంలో నైనా రామోజీరావు తన మార్కు పక్షపాత జర్నలిజం పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే, ప్రజాభిప్రాయం ప్రతిబింభించే జర్నలిజం చూపిస్తారని ఆశించే వారికి భంగపాటే మిగిల్చారు. ఇప్పుడు మరింత విజృంభించి టిడిపి, ఓ వర్గం అనుకూల వార్తలు మాత్రమే రాయించేందుకు నడుం బిగించినట్టు కనిపిస్తున్నారు.
వారం రోజుల క్రితమే మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు విజయవాడలో ఒక సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పులపై, తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే రామోజీరావు మాత్రం జస్టిస్ చంద్రు వార్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మూడురోజుల తర్వాత కొందరు హైకోర్టు న్యాయమూర్తులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తే మాత్రం ఆ వార్తను ప్రముఖంగా రాయించారు. జస్టిస్ చంద్రు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అనే వార్తే ఈనాడులో లేదు. కానీ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు ఖండన మాత్రం పత్రికలో ప్రముఖంగా వచ్చింది. అదే ఈనాడు రామోజీరావు మార్కు అనుకూల జర్నలిజం. ఈ తరహా జర్నలిజం రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా మరింత నిర్లజ్జగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దర్శనం ఇవ్వబోతోంది.
తన అనుకూల వర్గం, టీడీపీ ప్రయోజనాలు కాపాడుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు జర్నలిజం రాజకీయం చేయబోతోంది. ఇక్కడ విలువలు ఉండవు. వలువలు కూడా ఉండవు. తన, తనకు కావాల్సిన వారి రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యం. ఆ ప్రయోజనాల పరిరక్షణే ఇక 2024 ఎన్నికల వరకూ రామోజీ మార్కు జర్నలిజం కాబోతోంది. తెలుగు పాఠకులు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠకులు ఈ తరహా రాజకీయ వార్తలకు సిద్ధంగా ఉండాల్సిందే.
Also Read : రామోజీరావు స్కూలే వేరు, ఇప్పుడది చెల్లదు