iDreamPost
iDreamPost
మనిషి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అర్థవంతమైన రీతిలో ఎదుటి మనిషికి తెలియపరచడానికి ఎంచుకున్న మార్గం బాష.కాలపరిణామంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులకు లోనై,లోనై ఏదొక రూపాన్ని సంతరించుకుంటుంది.పోనీ ఈ రోజుకి రూఢీ అయిన ఈ భాష ఇదే రూపంలో ఉంటుందా అంటే అది కూడా అసాధ్యం కదా!ఎందుకంటే భాష ఉన్నచోటే ఆగిపోవడానికి మట్టిదిబ్బ కాదు అదో నిత్యప్రవాహిని అనవసరమైన వాటిని విస్మరించుకుంటూ..అత్యవసరమైన వాటిని కలుపుకుంటూ..ముందుకు సాగుతుంది.అలాగే తనది అనుకుని సొంతం చేసుకున్న ప్రతిదాన్ని అభిమానించడం మనిషి అలవాటు.అయితే ఆ అలవాటు మనల్ని ముందుకు నడిపిస్తుందా?వెనక్కి తోస్తుందా?అనేదాన్ని బట్టే మన చైతన్యం ఆధారపడి ఉంటుంది.
తెలుగు భాష పట్ల అభిమానం వేరు,ఆ మాధ్యమం లో చదువుకోవడం వేరు.నేటి డిజిటల్ యుగంలో బతుకుదెరువు చూపే చదువులు కావాలి.అంత మాత్రాన తెలుగు మీద అభిమానం చచ్చిపోయినట్లే అనుకోవడం మన అవగాహన లేమీ,అమాయకత్వమే కానీ మరొకటి కానేరదు.పైగా ఫీజులు పోసి చదివే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ బళ్ళలో తెలుగు మీడియంలో చదువుతున్న వారికే గానీ,ప్రైవేటు బళ్ళల్లో చదివే మధ్యతరగతి,సంపన్న వర్గాల వారిలో మాతృభాషను ఉద్దరిద్దామనే తపన ఏ మాత్రం ఉన్నట్లుగా కనిపించడం లేదు.ప్రస్తుతం సమాజంలో నెలకొని ఉన్న పోటీ మూలానా ఆంగ్లభాషకున్న ప్రాధాన్యం మనందరికీ తెలుసు..ఆంగ్ల ప్రావీణ్యం లేక సరైన ఉద్యోగాలు రాకపోవడాలు తెలుసు.
అదికాక”అచ్చ తెలుంగునకు అక్షరములు ముప్పదియారు..”అంటూ.. చిన్నయసూరి గారు బాలవ్యాకరణం చెప్తే..ఆహా..అలాగా!!అనుకున్న మనకి మరి తెలుగులో యాబైఆరు అక్షరాలు ఎలా ఉన్నాయనే ఆలోచన కలగకపోవడం విచారకరం,ఆ మిగిలిన ఇరవై అక్షరాలు సంస్కృత అక్షరాలని మనలో ఎంతమందికి తెలుసు!?మన భాషలో ముప్పావు వంతు సంస్కృతమే కదా!?అదేకాకుండా ఉర్దూ, హిందీ, ఒరియా, పోర్చుగీస్, ఇంగ్లీష్…మొ,, మన నిత్య సంభాషణలో ఇన్నేసి అన్యభాష పదాలను ఉపయోగిస్తుంటాం…అప్పుడు మనకు భాషాభిమానం లేనట్టా…!?
తెలుగును పూర్తిస్థాయిలో తీసేస్తానని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు.పోటి ప్రపంచానికి అనుగుణంగా తమ పిల్లలను చదివించాలని ఆశపడి అప్పులపాలు అవుతున్న పేద,మధ్యతరగతి దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడంలో మన అవకాశవాదం,ఆత్మవంచనతనం కనిపించడం లేదా!?
ఆంగ్లమాధ్యమంలో చదివినంత మాత్రాన విద్యార్థులు ఆంగ్లభాషలో నిష్ణాతులౌతారనుకోవడం కూడా అపోహే…ఆంగ్లమాధ్యమం తీసుకురావాలన్న ఆలోచన వెంటే విద్యా ప్రమాణాలు మెరుగు పర్చడమనే చర్య బలంగా చొచ్చుకురావాలి.ప్రభుత్వ స్కూళ్ళను ఆంగ్లమాధ్యమం చేసినంత మాత్రానా ఇప్పటికిప్పుడు తెలుగుకు వచ్చిన నష్టమేమీ లేదు.మన నిత్య జీవితంలో ఉపయోగించే మాతృభాష అంత బలహీనమైనది కాదు.
సర్కార్ బళ్ళలో చదివిన అరకొర భాషా జ్ఞానంతో… అత్యున్నత యూనివర్సిటీల్లో ఆంగ్లమాధ్యమాలలో చదువులు పూర్తిచేసుకున్న వారిని కదిలిస్తే చెబుతారు.వారు ఆ స్థాయికి రావడానికి భాషాపరంగా వారు పడిన అవమానాలు,ఆత్మన్యూనతలు,కష్టాలను గురించి…
–శతపత్ర మంజరి