iDreamPost
android-app
ios-app

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం.. పరుగులు తీసిన ప్రయాణీకులు

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం.. పరుగులు తీసిన ప్రయాణీకులు

ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రైల్లో ప్రయాణించాలంటే ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం ప్రజల్లో బలంగా నాటుకుంటుంది. దానికి కారణమైంది ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదం. జూన్ ప్రారంభంలో జరిగిన రైలు ప్రమాదం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగివున్న గూడ్సును ఢీ కొట్టి పట్టాలు తప్పిన సంగతి విదితమే. వెంటనే మరో ట్రాక్ పై వెళుతున్న యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 275 మంది మృతి చెందారు. ఈ మృత్యు ఘోష మర్చిపోక ముందే తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ లో రామేశ్వరం నుండి కన్యాకుమారి వెళుతున్న రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 9 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఇటీవల కాలంలో రైలు పట్టాలు తప్పి, తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడిన సంఘటనలు అనేకం జరిగాయి. ఈ ఘటనలతో రైలు ప్రయాణాలంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా మరో రైలు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి హౌరా వెళుతున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైలు బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు ప్రయాణీకులు. రైలును ఆపేసి హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. సుమారు అరగంటకు పైగా రైలు నిలిచిపోయింది. సమాచారం రైల్వే అధికారులకు చేరగా.. ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. అనంతరం రైలు ముందుకు కదిలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణీకులు అదే రైలులో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.