iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం అద్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడి చరిత్ర మీద కోర్టులో సుమోటాగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన నేర చరిత్రకు సంబంధించిన అన్ని ఆధారాలు తాను సమర్పిస్తానని అంటున్నారు. అవసరం అనుకుంటే తానే కోర్టుకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అచ్చెన్నాయుడికి సంబంధించిన భాగోతం ఆయన వివరించారు.
గడిచిన ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ కి జరిగిన అవమానం గురించి అందరికీ తెలుసు. అయితే 1994లోనే ఇలాంటి అనుభవం అచ్చెన్నాయుడికి ఉందని దువ్వాడ అంటున్నారు. కోటబొమ్మాళి మండలం పిన్నింటి పేటలో పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ కోసం చేసిన ప్రయత్నాలను కూనా రామారావు అనే వ్యక్తి అడ్డుకుంటే అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి పాల్పడడంతో గ్రామస్తులు తిరగబడినట్టు వివరించారు. ఆ సందర్భంగా కర్రలు, కత్తులు తీసుకుని అచ్చెన్నాయుడిని తరిమికొట్టారని తెలిపారు. అంతేగాకుండా అచ్చెన్నాయుడి మీద మూత్రం కూడా పోసి అవమానించిన అనుభవం ఉందని తెలిపారు. ఆ తర్వాత అదే పంథాలో సాగుతూ ఓ పోలిస్ కానిస్టేబుల్ మీద చేసిన దౌర్జన్యానికి కోర్టులో శిక్ష కూడా అచ్చెన్నాయుడికి పడిందని శ్రీనివాస్ తెలిపారు. దానిని అప్పీల్ చేసుకుని అధికారం సహాయంతో కేసులు లేకుండా చేసుకున్నట్టు ఆరోపించారు.
ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు తండ్రి దాలినాయుడు కాలం నుంచే 40 ఏళ్లుగా నిమ్మాడలో రౌడీరాజ్యం నడుస్తోందని, హత్యల పరంపర సాగుతోందని దువ్వాడ ఆరోపించారు. స్వయంగా కింజరాపు కుటుంబీకులనే నలుగురిని హత్య చేసిన చరిత్ర ఉందన్నారు. 2 ఎకరాల భూమి నుంచి చంద్రబాబు తరహాలోనే అచ్చెన్న కుటుంబం అక్రమాలతో ఎదిగిందన్నారు. సింగపూర్, ఢిల్లీలో ఖరీదైన హోటళ్లున్నట్టు ప్రచారంలో ఉందని, సొంతంగా ఓ షిప్పు కూడా ఉందని అన్నారు. నిమ్మాడలో ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించిన ఎఫ్ సీ ఐ గొడౌన్ల ద్వారా మిల్లర్ల నుంచి కోట్ల రూపాయాల అక్రమ సంపాదన చేశారని ఆరోపించారు. భవానీ గ్రానైట్స్ లో విజిలెన్స్ దర్యాప్తులో తవ్వకాలకు, అక్కడ నుంచి తరలించిన గ్రానైట్ కి పొంతనలేదని ఆధారాలతో బయటపడిందన్నారు. దానికి జరిమానా కూడా చెల్లించారని అన్నారు. కోటబొమ్మాళి పీఏసీఎస్ లో అచ్చెన్న అన్న హరిప్రసాద్ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ఆరోపించారు.
జీఎస్టీ చెల్లించకుండా, ఆదాయపు పన్ను లేకుండా అడ్డగోలుగా వందల కోట్ల సంపాదన చేసుకున్నారని ఆరోపించారు. అచ్చెన్న గానీ, రామ్మోహన్ నాయుడికి గానీ దమ్ముంటే వాళ్ల జీఎస్టీ నెంబర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల క్రితం నిమ్మాడ నుంచి నరసన్నపేటకు బస్సులో వెళ్లేందుకు దారి ఖర్చులు కూడా లేని ఎర్రన్నాయుడు కుటుంబం ఎదిగిన తీరు వెనుక సాగిన అక్రమాలు శ్రీకాకుళం జిల్లా అంతటా తెలుసన్నారు. మద్యం. ఇసుక పేరుతో సాగించిన అక్రమాలలో బినామీలలతో అచ్చెన్న బరి తెగించి వ్యవహరించారన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత కింజరాపు కుటుంబం అక్రమాలకు ఎదురొడ్డి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో టెక్కలిలో తాము విజయం సాధించామన్నారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసే అవకాశం రావడంతో 90 శాతం స్థానాలను జగన్ పథకాలకు ప్రజలు కట్టబెట్టారన్నారు. అచ్చెన్న అక్రమాలను అడ్డుకుని, టెక్కలిలో ప్రజాస్వామ్యాన్ని పరిక్షించేందుకు న్యాయపోరాటం చేయబోతున్నట్టు వెల్లడించారు.