iDreamPost
iDreamPost
ఇండియన్ సెల్యులాయిడ్ ని తీవ్రంగా ప్రభావితం చేసిన దర్శకుల జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు మణిరత్నం. కెరీర్ ప్రారంభంలో తడబడినా మౌనరాగం, ఘర్షణ, నాయకుడు, గీతాంజలి, అంజలి, దళపతి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని ఇచ్చి వాటిని అప్ కమింగ్ డైరెక్టర్స్ కు రిఫరెన్స్ బుక్స్ లా మార్చిన ఘనత ఆయనది. తన శైలికి భిన్నంగా చేసిన ప్రయోగాలు కొన్ని లేకపోలేదు. 1992లో రోజా అద్భుత విజయం సాధించాక తన మీద విపరీతంగా పెరిగిపోయిన అంచనాలకు తగ్గ కథను సిద్ధం చేసుకోవడం మణిరత్నంకు సవాల్ గా మారింది. గాయం టైంలో రాంగోపాల్ వర్మకు రచన అందించినప్పుడు క్షణ క్షణం లాంటి మనీ థ్రిల్లర్ ని తీయాలనే ఆలోచన తనకూ ఉందని ఈ దిగ్గజ దర్శకుడు చెప్పడంతో ఇద్దరూ కలిసి ఓ సరికొత్త కాన్సెప్ట్ కి శ్రీకారం చుట్టారు. అదే తిరుడా తిరుడా.
నాసిక్ లో ప్రింట్ అయ్యే మన కరెన్సీని ట్రైన్ లో రవాణా చేస్తుండగా దాన్ని దుండగులు కాజేసే మాస్టర్ ప్లాన్ వేస్తారు. డబ్బున్న బోగీ మాయమవుతుంది. కట్ చేస్తే ఎక్కడో చిన్న పల్లెటూళ్ళో చిల్లర దొంగతనాలు చేసే ఇద్దరు దొంగలకు ఈ రాబరీతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఒకపక్క పోలీసులు మరోపక్క సిబిఐ డిపార్ట్ మెంట్ అందరూ కలిసి ఆ డబ్బు కోసం వేట మొదలుపెడతారు.దీనికి స్కెచ్ వేసిన మాఫియా గ్యాంగ్ సైతం దాని ఆచూకీ తెలియక సతమతమవుతుంది. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాలి. ప్రశాంత్, ఆనంద్ ల కన్నా ముందు మణిరత్నం దీన్ని జెడి చక్రవర్తి, ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా కాంబోలో తీయాలనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. ఆషీకీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాందించిన అను అగర్వాల్ తో పాటు హీరాను హీరోయిన్లుగా తీసుకున్నారు.
ఏఆర్ రెహమాన్ మరోసారి గూస్ బంప్స్ ఆల్బమ్ ని సిద్ధం చేశారు. పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించారు. తమిళ వెర్షన్ 1993 నవంబర్ 13న విడుదల కాగా తెలుగు కొంత ఆలస్యంగా 1994 జనవరి 27న రిలీజ్ చేశారు. రెండు భాషల్లోనూ దొంగ దొంగ మంచి విజయం దక్కించుకుంది కానీ మణిరత్నం రేంజ్ లో కమర్షియల్ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. టేకింగ్, మ్యూజిక్ యువతను కట్టిపడేశాయి. స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ నృత్య దర్శకుడి(రాజు సుందరం) విభాగాల్లో దీనికి జాతీయ అవార్డు దక్కింది. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో దొంగదొంగ ప్రీమియర్ జరిగింది. ఇటు వర్మ స్టైల్ అటు మణిరత్నం మేకింగ్ కలగలసిన సినిమాగా ఈ చిత్రం రాబరీ థీమ్స్ తో వచ్చిన ఇండియన్ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన క్లాసిక్ గా చెప్పుకోవచ్చు.
Also Read : Sankranthi 1991 : పండగ బరిలో అద్భుతాలు సృష్టించిన బడ్జెట్ చిత్రాలు – Nostalgia